Jetour T2 : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1000 కిమీ రేంజ్.. సఫారీ, ఎక్స్‌యూవీలకు చెక్ పెట్టనున్న జెటూర్ T2
సఫారీ, ఎక్స్‌యూవీలకు చెక్ పెట్టనున్న జెటూర్ T2
Jetour T2 : భారత ఆటోమొబైల్ రంగంలోకి మరో భారీ భాగస్వామ్యం అడుగుపెట్టింది. దేశీయ దిగ్గజం JSW మోటార్స్, చైనాకు చెందిన Chery Automobile జతకట్టాయి. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న మొట్టమొదటి సంచలనం జెటూర్ T2 ఎస్‌యూవీ. ఈ ఏడాది జనవరిలోనే ఈ ఒప్పందం కుదిరినప్పటికీ, తాజాగా ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు, లాంచ్ వివరాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఈ టీ2 ఎస్‌యూవీకి తయారీ కేంద్రంగా మారబోతోంది. 2026 మూడో త్రైమాసికంలో, అంటే సరిగ్గా దీపావళి సమయానికి ఈ కారు రోడ్లపైకి రానుంది.
ఈ జెటూర్ టీ2 ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్. అంటే దీనిని ఎలక్ట్రిక్ కారులా ఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే పెట్రోల్ పోయించి మామూలు కారులానూ వాడుకోవచ్చు. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ల కలయిక ఉంటుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్లోనే ఇది 130 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇక పెట్రోల్, బ్యాటరీ కలిపి వాడితే ఏకంగా 1000 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 7.2 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిమీ వేగాన్ని అందుకునే ఈ కారు పర్ఫార్మెన్స్ లోనూ మొనగాడే.
సైజు పరంగా చూస్తే జెటూర్ టీ2 ఒక రాక్షసుడిలా ఉంటుంది. దాదాపు 4.7 మీటర్ల పొడవు ఉండే ఈ కారు.. టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వంటి దిగ్గజాల కంటే పెద్దదిగా ఉండబోతోంది. డిజైన్ పరంగా దీనికి బాక్సీ లుక్, ఆఫ్-రోడ్ వెహికల్ లాంటి గంభీరమైన రూపం ఉంటుంది. ఇది కేవలం బాహ్య రూపంలోనే కాదు, సాంకేతికంగానూ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. చేరీ కంపెనీకి చెందిన కున్‌పెంగ్ సూపర్ హైబ్రిడ్ C-DM ప్లాట్‌ఫారమ్‌పై దీనిని నిర్మించారు. ఇది ఇంధన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా అదిరిపోయే పవర్ ను కూడా అందిస్తుంది.
ఇక కారు లోపలి ఫీచర్లు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇందులో 15.6 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచుల డిజిటల్ మీటర్, 12 స్పీకర్ల సోనీ ఆడియో సిస్టమ్ ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం లెదర్ సీట్లు, వెంటిలేటెడ్, హీటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి లగ్జరీ హంగులన్నీ ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ, ఎంజీ మోటార్స్ వెంచర్ కి ఈ పార్టనర్ షిప్ కి సంబంధం లేదని, ఇది పూర్తిగా స్వతంత్ర ప్రాజెక్ట్ అని కంపెనీ స్పష్టం చేసింది.