MG Motor : భారత మార్కెట్లోకి ఎంజీ సరికొత్త అస్త్రం.. ఒకే ఒక్క ఛార్జ్‌తో 1,100 కిలోమీటర్ల మైలేజ్
ఒకే ఒక్క ఛార్జ్‌తో 1,100 కిలోమీటర్ల మైలేజ్
MG Motor : భారతదేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఐదేళ్లలో పెట్రోల్, ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన సరికొత్త కార్లను వరుసగా మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే, ఈ నెల 16వ తేదీన ఒక సరికొత్త న్యూ ఎనర్జీ ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో పాపులర్ అయిన వులింగ్ స్టార్‌లైట్ 560 మోడల్ ఆధారంగా ఈ కొత్త కారును భారతీయ రోడ్లకు తగినట్లుగా రీ-డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల దేశీయ రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ దొరికిపోయిన ఈ కారు విశేషాలు వాహన ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా దీనిని రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో ఎంజీ మోటార్స్ లాంచ్ చేయనుంది. ఇందులో మొదటిది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ కాగా, రెండవది పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్. ఈ హైబ్రిడ్ వేరియంట్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్, 20.5 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ రెండు కలిపి బండికి 197 hp పవర్, 230 Nm టార్క్‌ను అందిస్తాయి. కేవలం బ్యాటరీ పవర్‌పైనే ఈ కారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇక పెట్రోల్, బ్యాటరీ రెండింటినీ కలిపి వాడితే ఏకంగా 1,100 కిలోమీటర్ల లాంగ్ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
పర్యావరణ హితంగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడే వారి కోసం దీని ఈవీ మోడల్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. ఇందులో పెద్దదైన 56.7 kWh బ్యాటరీ ప్యాక్‌ను సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేశారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 500 కిలోమీటర్ల నాన్‌స్టాప్ రేంజ్ ఇస్తుందని అంచనా. ఈ ఈవీ కారు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ప్రయాణాల్లో ఛార్జింగ్ త్వరగా అవ్వడం కోసం ఇందులో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు. దీనివల్ల చాలా తక్కువ సమయంలోనే బ్యాటరీ రీఛార్జ్ అయిపోతుంది.
ఈ కొత్త ఎస్‌యూవీ సైజ్ పరంగా కూడా చాలా పెద్దదిగా ఉండబోతోంది. దాదాపు 4.7 మీటర్ల పొడవు, విశాలమైన వీల్‌బేస్ కారణంగా కారు లోపల లెగ్‌రూమ్ చాలా లగ్జరీగా ఉంటుంది. ఇందులో ఏకంగా 763 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభించనుంది. మిడిల్ క్లాస్ ఉమ్మడి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని దీనిని 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టనున్నారు. ఇంటీరియర్‌లో 12.8 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8.8 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వాయిస్ కమాండ్స్, ప్రీమియం లెదర్ సీట్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌సీ, ఏబీఎస్ విత్ ఈబీడీ, టిపిఎమ్ఎస్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఈ కారు ఒక అద్భుతమైన ఛాయిస్ కానుంది.