Kawasaki W230 : రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కి కొత్త పోటీ.. రెట్రో లుక్‌తో కవాసకి W230 ఎంట్రీ!

రెట్రో లుక్‌తో కవాసకి W230 ఎంట్రీ!

Update: 2025-11-19 08:40 GMT

Kawasaki W230 : జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి తమ కొత్త రెట్రో-రోడ్‌స్టర్ స్టైల్ మోటార్‌సైకిల్ అయిన 2026 కవాసకి W230ను యూకే మార్కెట్‌లో తాజాగా పరిచయం చేసింది. ఈ బైక్ ధర, డెలివరీలు 2026 సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో కవాసకి W175 మోడల్‌ను విక్రయిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఆ మోడల్‌ను తొలగించి, దాని స్థానంలో ఈ కొత్త W230ని తీసుకురావచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ బైక్ గనుక ఇండియాకు వస్తే ఇక్కడ వేగంగా పెరుగుతున్న రెట్రో-స్టైల్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

కవాసకి W230 డిజైన్ పూర్తిగా పాతతరం క్లాసిక్ మోటార్‌సైకిళ్ల నుంచి ప్రేరణ పొందింది. ఈ బైక్ చూడగానే ఒక ప్యూర్-వింటేజ్ మెషిన్ అనే అనుభూతిని ఇస్తుంది. ఇందులో గుండ్రటి హెడ్‌ల్యాంప్, క్రోమ్ ఫినిషింగ్‌తో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, క్లాసిక్ స్టైల్‌లో ఉన్న సైడ్ ప్యానెల్స్ వంటివి దీనికి పక్కా రెట్రో లుక్‌ను అందిస్తున్నాయి. W230 బాడీ ప్రొఫైల్ చాలా చక్కగా ఉంది. దీని వలన సిటీ రోడ్లపై దీనిని చాలా సులభంగా నడపవచ్చు. పొట్టిగా లేదా ఎత్తుగా ఉన్న రైడర్‌లకు కూడా ఇది సౌకర్యవంతమైన ఆప్షన్ గా కనిపిస్తోంది.

కవాసకి W230లో కంపెనీ Kawasaki KLX230 మోడల్‌లో ఉపయోగించిన అదే ఇంజన్‌ను అమర్చారు. ఇది 233cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్. ఈ ఇంజన్ 18PS పవర్‌ను, 18.6Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ప్రత్యేకత దాని రిఫైన్డ్ పెర్ఫార్మెన్స్. ఈ పవర్ అవుట్‌పుట్ సిటీలో డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. కొత్తగా బైక్ నడపడం నేర్చుకునే వారికి కూడా ఇది సులువుగా కంట్రోల్ అవుతుంది.

ఇంజన్ KLX230 లా ఉన్నప్పటికీ W230లో మాత్రం రైడింగ్ అనుభూతి మరింత రిలాక్స్‌గా ఉండేందుకు గేరింగ్ సెటప్‌ను వేరేగా ఉంచారు. భారత మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న కవాసకి W175 ధర దాని ఫీచర్లతో పోలిస్తే ఎక్కువగా ఉండటం వల్ల అది అంతగా ప్రజాదరణ పొందలేకపోయింది. కానీ W230 మాత్రం వాల్యూ-ఫర్-మనీ బైక్‌గా నిరూపించుకునే అవకాశం ఉంది. W230 ఇంజన్ W175 కంటే చాలా పవర్ఫుల్, డిజైన్ కూడా ప్రీమియంగా ఉంది.

KLX230 మోడల్‌ను ఇప్పటికే భారత్‌లో ఎక్కువగా లోకలైజ్ చేశారు. కొత్త జీఎస్టీ 2.0 నిబంధనల తర్వాత KLX230 ధర రూ.3,30,000 నుంచి రూ.1,84,000 ఎక్స్-షోరూమ్‌కు తగ్గింది. దీనిని బట్టి చూస్తే కవాసకి W230 కూడా మెరుగైన లోకలైజేషన్‌తో తక్కువ ధరకే భారత మార్కెట్‌లో విడుదల కావచ్చు. ఒకవేళ ధర తగ్గితే ఈ బైక్ యమహా XSR155, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వంటి బైక్‌లకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News