Kia Seltos : టాటా కోటను బద్దలు కొట్టిన కియా.. 5 స్టార్ రేటింగ్‌తో సెల్టోస్ సేఫ్టీ సునామీ
5 స్టార్ రేటింగ్‌తో సెల్టోస్ సేఫ్టీ సునామీ
Kia Seltos : భారత ఆటోమొబైల్ రంగంలో ఇన్నాళ్లూ సేఫ్టీ అంటే కేవలం టాటా మోటార్స్ పేరే వినిపించేది. కానీ ఇప్పుడు ఆ రికార్డులను తిరగరాస్తూ కియా ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. కియా సెల్టోస్ తన లేటెస్ట్ 2026 మోడల్‌తో భద్రతా ప్రమాణాల్లో టాటా కార్లనే వెనక్కి నెట్టింది. భారతదేశపు సొంత క్రాష్ టెస్ట్ రేటింగ్ సంస్థ భారత్ NCAP తాజాగా విడుదల చేసిన ఫలితాలు ఆటోమొబైల్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. కియా సెల్టోస్ సెకండ్ జనరేషన్ మోడల్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 32 పాయింట్లకు గాను 31.70 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో ఎంతో ఆశలు పెట్టుకున్న టాటా సియెర్రా 31.14 పాయింట్లతో సరిపెట్టుకుంది. కేవలం అందం, ఫీచర్లకే పరిమితం కాకుండా.. ప్రాణరక్షణలో కూడా తాను నెంబర్ వన్ అని కియా నిరూపించుకుంది.
క్రాష్ టెస్ట్ రిపోర్ట్ ప్రకారం, 64 kmph వేగంతో ఢీకొన్నప్పుడు కూడా సెల్టోస్ క్యాబిన్ చెక్కుచెదరలేదు. డ్రైవర్, పక్కన కూర్చున్న వారి తల, మెడ భాగాలకు అత్యుత్తమ రక్షణ లభించింది. ఈ విభాగంలో 16 కి 15.70 స్కోరు వచ్చింది. పక్క నుంచి కారును ఢీకొన్నప్పుడు సెల్టోస్ 16/16 పర్ఫెక్ట్ స్కోరు సాధించి రికార్డు సృష్టించింది. డ్రైవర్ ఛాతీ, తొడల భాగాలు సురక్షితంగా ఉన్నాయని, కేవలం డ్రైవర్ ఎడమ కాలు కింది భాగానికి మాత్రం అడిక్వేట్ (పర్వాలేదు) సేఫ్టీ లభించిందని రిపోర్ట్ పేర్కొంది.
కుటుంబంతో ప్రయాణించే వారికి కియా సెల్టోస్ ఒక వరమనే చెప్పాలి. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 49 పాయింట్లకు గాను ఈ కారు 45 పాయింట్లు సాధించింది. 18 నెలల, 3 ఏళ్ల వయసున్న పిల్లల డమ్మీలతో చేసిన పరీక్షల్లో డైనమిక్ స్కోరు 24/24 గా నమోదైంది. చైల్డ్ సీట్ ఇన్‌స్టాలేషన్ (CRS)లో కూడా 12/12 పాయింట్లు వచ్చాయి. అంటే ప్రమాద సమయంలో వెనుక సీటులో ఉన్న చిన్న పిల్లలకు గాయాలయ్యే అవకాశం చాలా తక్కువ.
ఒకప్పుడు కియా కార్ల బిల్డ్ క్వాలిటీపై కొన్ని విమర్శలు ఉండేవి. వాటిని చెరిపేస్తూ, 2026 సెల్టోస్‌ను K3 ప్లాట్‌ఫారమ్ పై నిర్మించారు. ఇందులో అత్యాధునిక హై-స్ట్రెంత్ స్టీల్ వాడటం వల్ల కారు బాడీ ఇనుప కోటలా మారింది. అందుకే క్రాష్ టెస్టులో ఇంపాక్ట్ జరిగినప్పుడు ఆ ఒత్తిడిని కారు బాడీ పూర్తిగా తట్టుకోగలిగింది. సెల్టోస్‌లో కేవలం బాడీ మాత్రమే కాదు, ప్రమాదాలను ముందే గుర్తించే తెలివైన టెక్నాలజీ ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ వంటివి బేస్ వేరియంట్ నుంచే లభిస్తున్నాయి. వీటికి తోడు లెవల్-2 ADAS ఉండటం వల్ల.. కారు దానంతట అదే బ్రేకులు వేయడం, లైన్ దాటకుండా చూసుకోవడం వంటి పనులు చేస్తుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశమే 50 శాతం తగ్గుతుంది.
ప్రస్తుతం కియా సెల్టోస్ ధర రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. సెల్టోస్ సాధించిన ఈ 5-స్టార్ రేటింగ్ వల్ల మారుతి సుజుకి విక్టోరిస్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. భద్రత కోసం టాటా కార్లనే కొనాలనుకునే కస్టమర్లు ఇప్పుడు కియా వైపు కూడా చూస్తున్నారు.