Kia Seltos : కియా సెల్టోస్ కొత్త ధమాకా.. మార్కెట్లోకి మరో రెండు లగ్జరీ వేరియంట్లు
మార్కెట్లోకి మరో రెండు లగ్జరీ వేరియంట్లు
Kia Seltos : భారతీయ రోడ్లపై స్టైలిష్ ఎస్‌యూవీగా పేరుగాంచిన కియా సెల్టోస్ ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ అవతారంలోకి మారబోతోంది. ఇప్పటికే భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించి సేఫ్టీ కింగ్ అనిపించుకున్న సెల్టోస్, ఇప్పుడు మరో రెండు కొత్త టాప్ వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అదిరిపోయే ఫీచర్లు, లగ్జరీ హంగులతో రాబోతున్న ఈ కొత్త మోడళ్ల వివరాలు ఇప్పుడు ఆటోమొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
లీకైన కొత్త వేరియంట్ల గుట్టు
కియా ఇండియా తన పాపులర్ ఎస్‌యూవీ సెల్టోస్‌లో GTX(O), X-Line(O) అనే రెండు కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టనుంది. ఈ విషయం కంపెనీ అధికారికంగా ప్రకటించకముందే భారత్ ఎన్‌క్యాప్ క్రేష్ టెస్ట్ డాక్యుమెంట్ల ద్వారా బయటపడింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న GTX(A), X-Line(A) కంటే ఇవి మెరుగైన ఫీచర్లతో ఉండబోతున్నాయి. అంటే సెల్టోస్ లైనప్‌లో ఇవి అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన మోడళ్లుగా నిలవనున్నాయి.
తిరిగి రాబోతున్న హెడ్-అప్ డిస్ప్లే
కొత్త సెల్టోస్ లో కంపెనీ కొన్ని అద్భుతమైన మార్పులు చేస్తోంది. గతంలో సెల్టోస్ పాత వెర్షన్‌లో ఉన్న హెడ్-అప్ డిస్ప్లే (HUD) ఫీచర్‌ను కొత్త జనరేషన్‌లో తొలగించారు. కానీ ఇప్పుడు రాబోయే (O) వేరియంట్లలో దీనిని మళ్ళీ చేర్చబోతున్నారు. దీనితో పాటు డాష్‌క్యామ్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం పవర్డ్ సీటు, ఇన్-బిల్ట్ నావిగేషన్, సీట్ మెమరీ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉండబోతున్నాయని సమాచారం. డ్రైవింగ్ చేసేటప్పుడు కళ్ళు రోడ్డుపైనే ఉంచి వేగం, మ్యాప్స్ చూసుకునేందుకు హెడ్-అప్ డిస్ప్లే ఎంతో ఉపయోగపడుతుంది.
డిజైన్, స్టైల్ ఎలా ఉండబోతోంది?
డిజైన్ పరంగా చూస్తే ఈ కొత్త వేరియంట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కానీ, కొన్ని ప్రత్యేక హంగులు జోడించనున్నారు. GTX(O) వేరియంట్ స్పోర్టీ లుక్‌లో, పెద్ద బంపర్లు, గ్రీన్ బ్రేక్ కాలిపర్లతో అలరించనుంది. ఇక X-Line(O) వేరియంట్ మ్యాట్ ఫినిష్ పెయింట్, పూర్తి బ్లాక్ థీమ్ తో చాలా మ్యాచో లుక్‌లో ఉండబోతోంది. లోపల 12.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, పనోరమిక్ సన్ రూఫ్, 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్ వంటివి కస్టమర్లకు లగ్జరీ ఫీల్ ఇస్తాయి.
సేఫ్టీలో మళ్ళీ 5-స్టార్ భరోసా
సేఫ్టీ విషయంలో కియా సెల్టోస్ ఇప్పటికే తన సత్తా చాటింది. కొత్త వేరియంట్లలో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటివి ఉంటాయి. వీటన్నింటికీ మించి లెవల్-2 ADAS టెక్నాలజీ కూడా ఉండటంతో, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సెల్టోస్ ముందుంటుంది. అంటే ప్రయాణం ఎంత విలాసవంతంగా ఉంటుందో అంతే సురక్షితంగా కూడా ఉంటుందన్నమాట.
ఇంజిన్ పవర్, లాంచ్ వివరాలు
ఈ కొత్త వేరియంట్లు 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 hp), 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ (116 hp) ఆప్షన్లతో రానున్నాయి. పెట్రోల్ మోడల్ 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో, డీజిల్ మోడల్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటాయి. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ కొత్త వేరియంట్లు మే లేదా జూన్ 2026 నాటికి భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు. వీటి ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 19 లక్షల నుంచి రూ. 22 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.