Kia Sorento: 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు.. మార్కెట్లో దుమ్ములేపుతున్న కియా సొరెంటో
కియా సొరెంటో
Kia Sorento: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ నెలలో కియా సంస్థ తన నెలవారీ హోల్‌సేల్ అమ్మకాల ద్వారా ఏకంగా 32,017 యూనిట్లను విక్రయించి ఇప్పటివరకు ఎన్నడూ లేనంత రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 41 శాతం అధికం కావడం విశేషం. కంపెనీ చరిత్రలో ఒక నెలలో 30,000 యూనిట్ల మార్క్‌ను దాటడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా కియా ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ఆల్-న్యూ సోరెంటో ఎస్యూవీ తన లాంచ్ తొలి నెలలోనే అద్భుతమైన స్పందనను రాబట్టింది.
కియా సోరెంటో అమ్మకాల వివరాలు
సెప్టెంబర్ 4న అధికారికంగా లాంచ్ అయిన ఈ ప్రీమియం 7-సీటర్ ఎస్యూవీ, డెలివరీలు వెంటనే ప్రారంభం కావడంతో తొలి నెలలోనే 1,739 యూనిట్ల హోల్‌సేల్‌ను నమోదు చేసింది. దీనికి ముందు ఆగస్టులో డీలర్ల వద్దకు చేరిన 365 యూనిట్లతో కలుపుకుంటే సొరెంటో మొత్తం అమ్మకాలు 2,104 యూనిట్లకు చేరాయి. ఈ సొరెంటో ఎస్యూవీ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.27.99 లక్షలుగా ఉండగా, స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్ ధర దాదాపు రూ.29.49 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. భారత మార్కెట్ కోసం కియా అందిస్తున్న మొట్టమొదటి స్ట్రాంగ్-హైబ్రిడ్ ప్యాసింజర్ కారు ఇదే కావడం గమనార్హం.
పవర్ ఫుల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు
పర్ఫామెన్స్ పరంగా సొరెంటో ఎస్‌యూవీలో అత్యాధునిక ఇంజిన్ ఆప్షన్లను అమర్చారు. హైబ్రిడ్ వెర్షన్లో ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను జతచేశారు. ఈ కాంబినేషన్ ద్వారా ఇంజిన్ సుమారు 180PS పవర్ అలాగే 265Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు వినియోగదారుల కోసం 2.2-లీటర్ శక్తివంతమైన డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. తద్వారా సిటీ రోడ్లపై అలాగే లాంగ్ డ్రైవ్‌లలో అద్భుతమైన మైలేజీతో పాటు అమోఘమైన డ్రైవింగ్ అనుభూతిని ఈ కారు అందిస్తుంది.
అత్యాధునిక లగ్జరీ ఫీచర్లు
ఈ ప్రీమియం ఎస్‌యూవీలో ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక హై-ఎండ్ ఫీచర్లను పొందుపరిచారు. ఇందులో డ్యూయల్ డిజిటల్ డిస్ప్లేలు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), రాడార్ బేస్డ్ సేఫ్టీ ఫంక్షన్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ టైల్గేట్, 360-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, బోస్ ఆడియో సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇండియా-స్పెసిఫిక్ మోడల్ కావడంతో కియా ప్రత్యేకంగా ఏఐ-బేస్డ్ అసిస్టెంట్‌ను కూడా అందించింది.