Kia Sorento: 6, 7 సీటర్ల ఆప్షన్లు.. అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్‌లోకి కియా సోరెంటో గ్రాండ్ ఎంట్రీ
కియా సోరెంటో గ్రాండ్ ఎంట్రీ
Kia Sorento: భారత ఆటోమొబైల్ రంగాన్ని ఊపేసేందుకు కియా సంస్థ సరికొత్త సోరెంటో ప్రీమియం ఎస్‌యూవీని భారత మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల చేసింది. రూ. 27.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు డిజైన్, అద్భుతమైన ఇంజిన్ ఆప్షన్లతో ప్రముఖ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ కియా కంపెనీ అత్యంత ప్రసిద్ధ సోరెంటో మోడల్‌ను భారత విపణిలోకి ప్రవేశపెట్టింది. లగ్జరీ లవర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వాహనం రూ.27.99 లక్షల (ఎక్స్-షోరూమ్) బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ మోడల్ రూ.40.39 లక్షల ధరల శ్రేణిలో లభిస్తుంది. డీజిల్ సహా పర్యావరణహిత హ్యాబ్రిడ్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులోకి రావడం ఈ కారు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా 6 సీటర్, 7 సీటర్ లేఅవుట్లతో వేరియంట్లను సంస్థ రూపుదిద్దింది.
పవర్‌ఫుల్ డీజిల్, హైబ్రిడ్ ఇంజిన్ల ఆప్షన్లు
ఆటోమొబైల్ లవర్స్ కోసం కియా రెండు శక్తివంతమైన ఇంజిన్ వేరియంట్లను అందుబాటులో ఉంచింది. మొదటిది 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ కలిగిన 2.2 లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ డీజిల్ ఇంజిన్ కాగా, రెండవది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే 1.6 లీటర్ టర్బో-పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్. 7-సీటర్ డీజిల్ ఎంట్రీ వేరియంట్ HTE ధర రూ. 27.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక పర్యావరణ స్పృహ కలిగిన వినియోగదారుల కోసం తెచ్చిన హైబ్రిడ్ మోడల్ ప్రారంభ ధర రూ. 29.49 లక్షలుగా నిర్ణయించారు.
రోడ్డుపై తిరుగులేని గ్రాండ్ ప్రెజెన్స్
కఠినమైన రహదారులను సైతం సులువుగా అధిగమించడానికి వీలుగా సోరెంటో హై-ఎండ్ మోడళ్లలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌ను అందించారు. డీజిల్ శ్రేణిలో HTX వేరియంట్ నుంచి రూ. 37.49 లక్షల ముందస్తు ధరతో ఈ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లభిస్తుంది. కాగా అత్యంత విలాసవంతమైన 6-సీటర్ క్యాబిన్ కోరుకునే వారి కోసం డ్యూయల్ కెప్టెన్ సీట్ల ఆప్షన్ తెచ్చారు. ఈ 6-సీటర్ హైబ్రిడ్ టాప్-స్పెక్ HTX(A) బ్లాక్ లైన్ AWD వేరియంట్ రూ.40.39 లక్షల గరిష్ట ధరకు అందుబాటులో ఉంది.
అత్యాధునిక ఏడీఏఎస్ సేఫ్టీ
సేఫ్టీ విషయంలో కియా ఎక్కడా తగ్గలేదు. పేరు చివరిలో (A) అని ఉండే వేరియంట్లలో అత్యాధునిక అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ సేఫ్టీ ప్యాకేజీని పొందుపరిచారు. వీటితో పాటు స్పెషల్ 'బ్లాక్ లైన్' స్టైలింగ్ ప్యాక్ ద్వారా కారుకు బోల్డ్, స్పోర్టీ లుక్ లభిస్తుంది. ప్రమాదాల నుంచి ముందస్తు రక్షణ కల్పించే సెన్సార్లు, అత్యవసర బ్రేకింగ్ వ్యవస్థ, కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఈ వాహనంలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.