Kia Syros EV : కియా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. జూలై 2026లో సైరోస్ ఈవీ లాంచ్

జూలై 2026లో సైరోస్ ఈవీ లాంచ్

Update: 2026-04-14 10:36 GMT

Kia Syros EV : భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో తన పట్టును మరింత బిగించేందుకు కియా మోటార్స్ సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రీమియం ఈవీలను మాత్రమే అందించిన ఈ కొరియన్ కంపెనీ, ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా తన అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా సైరోస్ ఈవీని లాంచ్ చేయబోతోంది. జూలై 2026లో ఈ కారు భారత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ వంటి పాపులర్ మోడళ్లకు ఈ కారు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

కియా సైరోస్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో ఇది మార్కెట్లో ఉన్న ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV 3XO ఈవీ వంటి కార్లకు ప్రధాన శత్రువుగా మారనుంది. కియా నుంచి వస్తున్న నాలుగో ఎలక్ట్రిక్ కారు కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సైరోస్ ఈవీ డిజైన్ చూడటానికి చాలా గంభీరంగా, బాక్సీ షేప్‌లో ఉంటుంది. నిలువుగా ఉండే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్-షేప్ డిఆర్ఎల్స్‌తో ఇది ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. భద్రత కోసం ఫ్రంట్ బంపర్‌లో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) రాడార్ సెన్సార్‌ను అమర్చనున్నారు. స్పై చిత్రాల ప్రకారం, దీనికి 17-ఇంచుల అలాయ్ వీల్స్, నియాన్ గ్రీన్ కలర్ బ్రేక్ కాలిపర్స్ ఉంటాయని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వెర్షన్ కావడంతో ఫ్రంట్ గ్రిల్ మూసివేసి సరికొత్త లుక్‌తో రానుంది.

కారు లోపల డ్యూయల్ స్క్రీన్ సెటప్ (ఇన్ఫోటైన్‌మెంట్ + ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో V2L (Vehicle-to-Load), V2V (Vehicle-to-Vehicle) వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఉండవచ్చు. V2L ద్వారా మీరు మీ కారు బ్యాటరీతో లాప్‌టాప్ లేదా చిన్న గృహోపకరణాలను వాడుకోవచ్చు. ఇంకా పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఇందులో పక్కాగా ఉంటాయి.

కియా సైరోస్ ఈవీలో హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ ప్లాట్‌ఫారమ్‌ను వాడే అవకాశం ఉంది. ఇందులో 42kWh, 49kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండవచ్చని సమాచారం. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది సుమారు 350 నుంచి 369 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని అంచనా. రోజువారీ సిటీ ప్రయాణాలతో పాటు, చిన్నపాటి లాంగ్ ట్రిప్స్‌కు కూడా ఇది ఒక గొప్ప ఆప్షన్‌గా నిలవనుంది.

Tags:    

Similar News