Kinetic DX: ఒకసారి ఛార్జ్ చేస్తే 132 కిమీ..కైనెటిక్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
Kinetic DX: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ కైనెటిక్ తమ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిఎక్స్ సిరీస్‌లో సరికొత్త డిఎక్స్ ప్లస్ 3.1 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో వచ్చిన ఈ మోడల్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 132 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండటంతో ఈ-స్కూటర్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.
భారీ బ్యాటరీ సామర్థ్యం.. మెరుగైన రేంజ్
ఎలక్ట్రిక్ వాహనదారులను ప్రధానంగా వేధించే ఛార్జింగ్ సమస్యకు చెక్ పెడుతూ కైనెటిక్ ఈ కొత్త మోడల్‌ను రూపొందించింది. ఇందులో 3.1 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల ఎల్ఎఫ్పి బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది వాహనానికి మెరుగైన థర్మల్ స్థిరత్వాన్ని, సుదీర్ఘ లైఫ్‌ను అందిస్తుంది. మునుపటి 2.6 కేడబ్ల్యూహెచ్ మోడల్ ఐడీసీ పరీక్షల్లో 105 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగా, ఈ కొత్త వేరియంట్ అంతకంటే 27 కిలోమీటర్లు అదనంగా అంటే 132 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యాన్ని నమోదు చేసింది. రోజువారీ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ స్కూటర్ చక్కటి ప్రత్యామ్నాయంగా మారనుంది.
పవర్, మైలేజ్ మధ్య ఆసక్తికర వ్యత్యాసం
కొత్త 3.1 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌లో కేవలం బ్యాటరీ సైజ్ మాత్రమే కాకుండా మోటార్ సామర్థ్యాన్ని కూడా ఆసక్తికరంగా మార్చారు. ఈ స్కూటర్‌లో 3.8 కేడబ్ల్యూ పీక్ పవర్ ఇచ్చే మోటార్ అమర్చారు. పాత 2.6 కేడబ్ల్యూహెచ్ వెర్షన్‌లో 4.78 కేడబ్ల్యూ మోటార్ ఉండేది. అంటే కొత్త మోడల్ వేగం కంటే ఎక్కువగా మైలేజ్, రేంజ్‌పై దృష్టి సారించింది. ఇందులో 'రేంజ్', 'పవర్' అనే రెండు రైడింగ్ మోడ్లు మాత్రమే అందించారు. ఫాస్ట్ పికప్, టర్బో మోడ్ కోరుకునే వారు 2.6 కేడబ్ల్యూహెచ్ మోడల్‌ను ఎంచుకోవచ్చు. రీఛార్జ్ నిమిషాల్లో ముగిసిపోవాలని, ఎక్కువ రేంజ్ కావాలనుకునే వారికి 3.1 కేడబ్ల్యూహెచ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
హైటెక్ ఫీచర్లు.. మెటల్ బాడీ సెటప్
రక్షణ, సౌకర్యం విషయంలో కైనెటిక్ ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. గట్టిదనానికి పేరుగాంచిన మెటల్ బాడీతో పాటు ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్ ఇచ్చారు. డ్రైవర్ సమాచారం కోసం 8.8 అంగుళాల ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్‌ను అమర్చారు. సీటు కింద ఏకంగా 37 లీటర్ల విశాలమైన స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. పాస్‌వర్డ్ ఆధారిత ఇగ్నిషన్‌తో కూడిన కీలెస్ గో, క్రూజ్ కంట్రోల్, టెలిమాటిక్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, పార్క్ అసిస్ట్, రివర్స్ మోడ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి అత్యధునిక ఫీచర్లు ఈ వాహనంలో కొలువుదీరాయి.
ధర, కలర్ ఆప్షన్ల వివరాలు
వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ కొత్త స్కూటర్‌ను ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. రెడ్, బ్లూ, బ్లాక్, గ్రే, వైట్ కలర్ ఆప్షన్లు లభిస్తున్నాయి. కైనెటిక్ డీఎక్స్ సిరీస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.18 లక్షలుగా ఉండగా, సరికొత్తగా వచ్చిన డిఎక్స్ ప్లస్ 3.1 కేడబ్ల్యూహెచ్ మోడల్ ఈ సిరీస్‌లోనే అత్యంత టాప్ ఎండ్ వెర్షన్‌గా నిలిచింది.