LED vs Halogen : ఏది బెస్ట్? వర్షంలో మీ కారుకు ఏ లైటు ఉంటే రోడ్డు క్లియర్‌గా కనిపిస్తుంది?
వర్షంలో మీ కారుకు ఏ లైటు ఉంటే రోడ్డు క్లియర్‌గా కనిపిస్తుంది?
LED vs Halogen : రాత్రి వేళ కారు నడుపుతున్నప్పుడు లేదా వాతావరణం బాలేనప్పుడు మనకు కళ్లుగా పనిచేసేవి హెడ్‌లైట్లే. ఒకప్పుడు అన్ని కార్లలో పసుపు రంగులో వెలిగే హాలోజన్ లైట్లే ఉండేవి. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త కార్లలో స్టైలిష్‌గా ఉండే ఎల్‌ఈడీ లైట్లు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, కేవలం లుక్ చూసి లైట్లను ఎంచుకుంటే పొరపాటే అంటున్నారు నిపుణులు. ఈ రెండింటి మధ్య తేడాలేంటి? మీ కారుకు ఏది సెట్ అవుతుందో వివరంగా చూద్దాం.
హాలోజన్ లైట్లు
చాలా ఏళ్లుగా కార్లలో హాలోజన్ లైట్లనే వాడుతున్నారు. వీటిలో ఉండే టంగ్‌స్టన్ ఫిలమెంట్ వేడెక్కి వెలుతురునిస్తుంది. వీటి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. బల్బ్ పోతే మార్చుకోవడం కూడా చాలా సులభం. అన్నిటికంటే ముఖ్యంగా, వర్షం పడుతున్నప్పుడు లేదా పొగమంచు ఉన్నప్పుడు హాలోజన్ ఇచ్చే పసుపు రంగు వెలుతురు రోడ్డును స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇవి ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి, కారు బ్యాటరీని ఎక్కువగా ఖర్చు చేస్తాయి. వీటి జీవితకాలం కూడా కొంచెం తక్కువే.
ఎల్‌ఈడీ లైట్లు
ప్రస్తుతం వస్తున్న ప్రీమియం కార్లలో ఎల్‌ఈడీ లైట్లే ప్రధాన ఆకర్షణ. ఇవి తక్కువ విద్యుత్తును వాడుకుంటూనే తెల్లని ప్రకాశవంతమైన వెలుతురునిస్తాయి. రాత్రిపూట హైవేలపై వెళ్తున్నప్పుడు పగటిపూట లాంటి వెలుతురునివ్వడం వీటి ప్రత్యేకత. అంతేకాకుండా ఇవి కారుకు మోడ్రన్ లుక్‌ను తీసుకొస్తాయి. కానీ వీటి ధర హాలోజన్ కంటే చాలా ఎక్కువ. ఒకవేళ మీ కారులో ఎల్‌ఈడీ సెటప్ లేకపోతే, విడిగా వేయించుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. సరిగ్గా ఫిట్ చేయకపోతే ఎదురుగా వచ్చే డ్రైవర్ల కళ్లు జిగేల్మనే ప్రమాదం కూడా ఉంది.
దేన్ని ఎంచుకోవాలి?
మీరు ఎక్కువగా నగరాల్లో లేదా బాగా వెలుతురున్న హైవేలపై డ్రైవ్ చేసేవారైతే ఎల్‌ఈడీ లైట్లు మంచి ఆప్షన్. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉండి, వర్షాకాలం లేదా మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తుంటే మాత్రం హాలోజన్ లైట్లే మీకు శ్రీరామరక్ష. ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు హైబ్రిడ్ సెటప్‌ను అంటే.. లో-బీమ్ కోసం ఎల్‌ఈడీ, హై-బీమ్ కోసం హాలోజన్ వాడుతున్నాయి. మీ డ్రైవింగ్ అవసరాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.