Lok Adalat 2026 : లోక్ అదాలత్‌కు వెళ్తున్నారా? ఈ ఒక్క కాగితం లేకపోతే మీ చలాన్ క్లియర్ అవ్వదు
ఈ ఒక్క కాగితం లేకపోతే మీ చలాన్ క్లియర్ అవ్వదు
Lok Adalat 2026 :మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? వాటిని వదిలించుకోవడానికి మీరు లోక్ అదాలత్ టోకెన్ తీసుకున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాలి. మార్చి 14, 2026 (శనివారం)న జరగబోయే లోక్ అదాలత్‌కు వెళ్లే ముందు మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. టోకెన్ బుక్ చేసుకున్నంత మాత్రాన పని అయిపోదు, సరైన డాక్యుమెంట్లు లేకపోతే కోర్టులో మీ చలాన్ క్లియర్ అవ్వదు సరే కదా, మీ సమయం కూడా వృథా అవుతుంది.
ప్రింట్ అవుట్ లేకపోతే నో ఎంట్రీ
చాలామంది ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత, మొబైల్‌లో ఉన్న సాఫ్ట్ కాపీ చూపిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ లోక్ అదాలత్‌లో ఫిజికల్ ప్రింట్ అవుట్ చాలా ముఖ్యం. మీరు బుక్ చేసుకున్న టోకెన్ లేదా అపాయింట్‌మెంట్ స్లిప్‌ను ఖచ్చితంగా ప్రింట్ తీసుకుని వెంట తీసుకెళ్లాలి. కోర్టు ప్రాంగణంలో ప్రింట్లు తీసే సదుపాయం ఉండకపోవచ్చు, కాబట్టి ఇంటి నుంచే కాగితం సిద్ధం చేసుకోవడం ఉత్తమం. ఈ స్లిప్ లేనిదే మిమ్మల్ని లోపలికి అనుమతించరు.
అపాయింట్‌మెంట్ స్లిప్ ఎందుకు ముఖ్యం?
మీరు తీసుకెళ్లే ఆ ప్రింట్ అవుట్‌లో కేవలం మీ పేరు మాత్రమే కాదు, చాలా ముఖ్యమైన వివరాలు ఉంటాయి. మీరు ఏ కోర్టు నంబర్‌కు వెళ్లాలి, ఏ సమయానికి హాజరు కావాలి అనే విషయాలతో పాటు.. మీ చలాన్ ఏ రోజున కట్ అయింది, మోటారు వాహన చట్టంలోని ఏ సెక్షన్ కింద జరిమానా పడింది వంటి పూర్తి సమాచారం అందులో ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే న్యాయమూర్తి మీ కేసును పరిశీలిస్తారు.
బార్ కోడ్ స్లిప్ జాగ్రత్త
మీ అపాయింట్‌మెంట్ లెటర్ కింద భాగంలో మూడు బార్ కోడ్స్ కనిపిస్తాయి. మీరు చలాన్ డబ్బులు కట్టిన తర్వాత లేదా కోర్టు జరిమానాను రద్దు/తగ్గించిన తర్వాత, అక్కడి సిబ్బంది ఆ బార్ కోడ్ ఉన్న స్లిప్‌ను కట్ చేసి మీకు రసీదుగా ఇస్తారు. భవిష్యత్తులో మీ చలాన్ క్లియర్ అయిందని నిరూపించుకోవడానికి ఇదే ప్రధాన ఆధారం. అందుకే, ఆ డాక్యుమెంట్‌ను ఎక్కడా మడతపెట్టకుండా లేదా చినిగిపోకుండా జాగ్రత్తగా తీసుకెళ్లండి. ఈ చిన్న పొరపాటు జరిగినా మీ చలాన్ల పరిష్కారం ఆగిపోయే ప్రమాదం ఉంది.