Luxury Cars: భారత్‌లోని సంపన్న కార్ల కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. కేవలం ఇంధన పొదుపు కోసమే కాకుండా స్వంత ఛార్జింగ్ వసతులు, అదనపు కార్ల లభ్యత, అద్భుతమైన పవర్, తక్కువ జీఎస్టీ పన్నులు ఈ కొత్త విప్లవానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ సేల్స్ ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. సాధారణ వాహనదారులకు ఈవీ కొనుగోలులో ప్రధాన అడ్డంకి ఛార్జింగ్ స్టేషన్ల కొరత. సంపన్నులకు ఈ ఇబ్బంది అస్సలు ఎదురుకావడం లేదు. విస్తారమైన విల్లాలు, పెద్ద నివాసాలు, ప్రైవేట్ పార్కింగ్ ప్రదేశాలు ఉండటంతో తమ ఇళ్లలోనే సులభంగా హోమ్ ఛార్జర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రంతా ఛార్జ్ చేసి ఉదయాన్నే హాయిగా ప్రయాణమవుతున్నారు. దూర ప్రయాణాల్లో ఛార్జింగ్ అయిపోతుందనే భయం కూడా వీరికి ఉండదు. రోజువారీ నగర ప్రయాణాలకు ఈవీలను వాడి, సుదీర్ఘమైన సుదూర ప్రయాణాల కోసం గ్యారేజ్‌లో ఉండే ఇతర పెట్రోల్ లేదా డిజైన్ కార్లను వినియోగిస్తున్నారు.

పన్ను రాయితీలు.. అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతి

ధర వ్యత్యాసం ఉన్నప్పటికీ లగ్జరీ విభాగంలో పన్ను లబ్ధి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. సంప్రదాయ పెట్రోల్, డిజైన్ లగ్జరీ వాహనాలపై భారీగా సెస్‌తో పాటు పన్నులు పడుతుండగా, ఎలక్ట్రిక్ కార్లపై జీఎస్టీ కేవలం 5 శాతం మాత్రమే ఉండటం పెద్ద కలిసివచ్చే అంశం. నిశ్శబ్దంగా సాగే కేబిన్ ప్రయాణం, క్షణాల్లో వేగాన్ని అందుకునే ఇన్‌స్టంట్ టార్క్ ఈవీల ప్రత్యేకత. ఇంజిన్ శబ్దం లేని ప్రశాంతమైన ప్రయాణాన్ని లగ్జరీ ప్రియులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వీరిని ఈవీల వైపు నడిపిస్తున్నాయి.

దిగ్గజ బ్రాండ్ల వరుస మోడళ్లు.. మార్కెట్‌లో హోరాహోరీ

కొన్నేళ్ల క్రితం వరకు లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌లో మోడళ్ల ఎంపిక చాలా పరిమితంగా ఉండేది. ప్రస్తుతం పోర్షే, వోల్వో, రోల్స్ రాయిస్, ఫెరారీ, లెక్సస్ వంటి బ్రాండ్లు అత్యంత ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ వర్షన్లను విపణిలోకి తెచ్చాయి. 2026 మొదటి ఆరు నెలల కాలంలో బిఎమ్‌డబ్ల్యూ భారతదేశంలో అమ్మిన ప్రతి నాలుగు కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ కావడం గమనార్హం. కంపెనీ ఏకంగా 2,359 ఈవీలను విక్రయించింది. మెర్సిడెస్ బెంచ్ కూడా 859 ఈవీలను విక్రయించగా, దాని ప్రసిద్ధ సిఎల్ఏ బిఈవి మోడల్ ఈ ఏడాదికి సంబంధించిన బుకింగ్స్ అన్నీ పూర్తయిపోయి వచ్చే ఏడాదికి వెయిటింగ్ లిస్ట్ చేరింది.

టెస్లాకు గట్టి పోటీ ఇస్తున్న జర్మన్ దిగ్గజాలు

భారతీయ ఈవీ విపణిలో డిమాండ్ పెరిగినప్పటికీ టెస్లా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. పరిమిత మోడళ్లతో వస్తున్న టెస్లాతో పోలిస్తే బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంచ్ వంటి సంస్థలు విభిన్న బడ్జెట్లు, రకాల్లో అనేక మోడళ్లను అందుబాటులోకి ఉంచడమే దీనికి కారణం. సంపన్నులకు కావలసిన వైవిధ్యం, వేగవంతమైన డెలివరీ, బలమైన షోరూమ్ నెట్‌వర్క్ జర్మన్ దిగ్గజాలకు బాగా కలసివస్తోంది.

Tags: