Luxury MPV : భారత్‌లో లగ్జరీ కార్ల హవా.. కంఫర్ట్‌తో పాటు సేఫ్టీలోనూ టాప్‌గా నిలుస్తున్న లగ్జరీ ఎంపీవీలు

కంఫర్ట్‌తో పాటు సేఫ్టీలోనూ టాప్‌గా నిలుస్తున్న లగ్జరీ ఎంపీవీలు

Update: 2026-06-06 07:06 GMT

Luxury MPV : భారతదేశంలో లగ్జరీ మల్టీ పర్పస్ వెహికల్ సెగ్మెంట్‌కు ఆదరణ రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. గతంలో లగ్జరీ కార్లు కొనే కస్టమర్లు కేవలం మెత్తటి సీట్లు, పెద్ద కేబిన్, ప్రీమియం లుక్స్ మాత్రమే చూసేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఇప్పుడు కారు ఎంతవరకు సురక్షితమైనది అనే అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాల వంటి హైటెక్ భద్రతా ఫీచర్లతో కూడిన కార్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో లగ్జరీతో పాటు ప్రాణాలకు వంద శాతం రక్షణ ఇచ్చే టాప్ 3 ఎంపీవీల వివరాలు ఇప్పుడు చూద్దాం.

లెక్సస్ ఎల్‌ఎమ్

భారత మార్కెట్లో లభ్యమవుతున్న అత్యంత ఖరీదైన, అత్యంత ప్రీమియం కారు లెక్సస్ ఎల్‌ఎమ్. ఈ అల్ట్రా లగ్జరీ ఎంపీవీ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.15 కోట్లుగా ఉంది. కారు వెనుక సీట్లో కూర్చుని లిమోసిన్ లాంటి రాయల్ అనుభూతిని పొందాలనుకునే వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ దీనిని డిజైన్ చేశారు. భద్రత విషయానికి వస్తే, ఇందులో లెక్సస్ సేఫ్టీ సిస్టమ్+ టెక్నాలజీని అందించారు. ఇది రోడ్డుపై వాహనం వేరే దానికి గుద్దుకోకుండా చూసే ప్రీ-కొలిజన్ సిస్టమ్, లేన్ ట్రాకింగ్ అసిస్ట్, అడాప్టివ్ హై-బీమ్ సిస్టమ్‌లతో పనిచేస్తుంది. అంతేకాకుండా, ఈ కారులో ఏకంగా 12 ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్ నిద్రపోకుండా అలర్ట్ చేసే మానిటర్, వెనుక కాలినడకన వెళ్లేవారిని గుర్తించే రేడార్ వ్యవస్థలు ఉన్నాయి. దీని బాడీ స్ట్రక్చర్ అత్యంత బలమైన మెటీరియల్‌తో తయారు చేయబడింది.

టయోటా వెల్‌ఫైర్

భారతదేశంలో ప్రముఖుల లగ్జరీ ప్రయాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మరో మోడల్ టయోటా వెల్‌ఫైర్. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.20 కోట్లుగా ఉంది. విశాలమైన కేబిన్, అత్యంత సౌకర్యవంతమైన సోఫా లాంటి సీట్లు, అదిరిపోయే హైబ్రిడ్ ఇంజన్ దీని సొంతం. డ్రైవర్ కారు నడుపుతుంటే వెనుక హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి శౌఫర్-డ్రైవెన్ మోడల్స్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. వెల్‌ఫైర్‌లో టయోటా సేఫ్టీ సెన్స్ 3.0 టెక్నాలజీని వాడారు. ఇందులో లేన్ డిపార్చర్ అలర్ట్, డైనమిక్ రేడార్ క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. కారుకు ఇరువైపులా ఉండే బ్లైండ్ స్పాట్లను గుర్తించే మానిటర్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని సేఫ్‌గా మారుస్తాయి. టయోటా గ్లోబల్ TNGA ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఈ కారు ప్రమాద సమయాల్లో క్రాష్ ఇంపాక్ట్‌ను సమర్థవంతంగా తట్టుకుంటుంది.

ఎంజీ ఎమ్9

ఎంజీ మోటార్ ఇండియా తన ప్రీమియం నెట్‌వర్క్ ఎంజీ సెలెక్ట్ ద్వారా సరికొత్త లగ్జరీ ఎంపీవీ ఎంజీ ఎమ్9ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ.75.90 లక్షలుగా ఉంది. పైన పేర్కొన్న మిగిలిన రెండు కార్లతో పోలిస్తే దీని ధర తక్కువైనప్పటికీ, లగ్జరీ ఫీచర్లలో ఇది దేనికీ తీసిపోదు. దీని కేబిన్ లోపల ప్రీమియం లెదర్ సీట్లు, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, మసాజ్ ఫంక్షన్ ఉన్న కెప్టెన్ సీట్లు ప్రయాణికులకు అలసట లేకుండా చేస్తాయి. సేఫ్టీ విషయానికి వస్తే ఎంజీ ఎమ్9 ఇంటర్నేషనల్ క్రాష్ టెస్టులైన ENCAP, ANCAP లలో ప్రతిష్టాత్మక 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇందులో లెవెల్-2 ADAS సిస్టమ్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో టాప్ క్లాస్ లగ్జరీ, గరిష్ట రక్షణ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ప్యాకేజీ.

Tags:    

Similar News