Mahindra Sales : రెండేళ్లు కాదు.. 24 ఏళ్లుగా ఇండియన్ రోడ్లపై స్కార్పియో హవా.. జూన్ అమ్మకాల్లో టాప్ ప్లేస్
జూన్ అమ్మకాల్లో టాప్ ప్లేస్
Mahindra Sales : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త మోడళ్లు, అధునాతన ఫీచర్లతో ఎన్నో కార్లు వస్తున్నప్పటికీ కొన్ని బ్రాండ్ల క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే మహీంద్రా స్కార్పియో. జూన్ 2026 నెలలో వాహన విక్రయాల పరంగా భారతీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కంపెనీ తన లైనప్‌లో ఉన్న సరికొత్త మోడళ్లు అయిన థార్ రాక్స్, ఎక్స్‌యూవీ 7XO వంటి కార్లను వెనక్కి నెట్టి.. పాత సింహం లాంటి స్కార్పియో సిరీస్‌తో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. జూన్ నెలలో దేశీయ మార్కెట్లో మహీంద్రా ఏకంగా 60,393 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది. గత ఏడాది జూన్ 2025లో అమ్ముడైన 47,306 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 27.66 శాతం ఎక్కువ కావడం విశేషం. అంటే గతేడాది కంటే ఈసారి అదనంగా 13,000 కార్లను మహీంద్రా విక్రయించింది.
24 ఏళ్లుగా తిరుగులేని హవా
మహీంద్రా విక్రయాల నివేదికను పరిశీలిస్తే.. జూన్ 2026లో కూడా స్కార్పియో క్లాసిక్, స్కార్పియో ఎన్ మోడళ్లు కంపెనీలోనే అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలుగా నిలిచాయి. ఈ రెండు మోడళ్లు కలిపి జూన్ నెలలో మొత్తం 14,097 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే వీటి విక్రయాలు 10.65 శాతం పెరిగాయి. మహీంద్రా మొత్తం అమ్మకాలలో కేవలం స్కార్పియో వాటాయే 23.34 శాతంగా ఉంది. అంటే షోరూమ్ నుండి బయటకు వస్తున్న ప్రతి నాలుగు మహీంద్రా కార్లలో ఒకటి ఖచ్చితంగా స్కార్పియోనే కావడం గమనార్హం. జూన్ 20, 2002న భారత్‌లో మొదటిసారి లాంచ్ అయిన ఈ కారు.. 24 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కస్టమర్ల ఫేవరెట్ ఎస్‌యూవీగా కొనసాగుతోంది.
ఆఫ్-రోడింగ్ కింగ్ థార్‌కు రెండో స్థానం
మహీంద్రా సేల్స్ లిస్టులో రెండో స్థానాన్ని యువతను అమితంగా ఆకట్టుకునే థార్ సిరీస్ కైవసం చేసుకుంది. త్రీ-డోర్ థార్, సరికొత్త థార్ రాక్స్ మోడళ్లు కలిపి జూన్ నెలలో మొత్తం 10,669 యూనిట్లు అమ్ముడయ్యాయి. వార్షిక ప్రాతిపదికన థార్ అమ్మకాలు 11.81 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ మొత్తం కార్ల విక్రయాల్లో థార్ వాటా 17.67 శాతంగా ఉంది. ఆఫ్-రోడింగ్, స్టైలిష్ లుక్ ఇష్టపడే కస్టమర్లలో థార్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
సేల్స్‌లో దుమ్మురేపుతున్న ఎక్స్‌యూవీ 3XO
జూన్ నెలలో మహీంద్రా కార్ల అన్నింటికంటే వేగంగా వృద్ధి చెందింది ఎక్స్‌యూవీ 3XO మోడల్ మాత్రమే. ఈ కారుకు సంబంధించిన పెట్రోల్, డీజిల్, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ వెర్షన్లన్నీ కలిపి మొత్తం 10,063 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే దీని అమ్మకాలు ఏకంగా 41.95 శాతం పెరిగాయి. ఇక మే 2026 నెలతో పోలిస్తే కేవలం ఒక్క నెలలోనే దీని అమ్మకాలు దాదాపు 50 శాతం పెరగడం విశేషం. మహీంద్రా మొత్తం సేల్స్‌లో దీని వాటా 16.66 శాతంగా నమోదైంది. దీని తర్వాత స్థానంలో ఉన్న ప్రీమియం కారు ఎక్స్‌యూవీ 7XO కూడా 9,244 యూనిట్ల విక్రయాలతో 49.14 శాతం అద్భుతమైన వృద్ధిని సాధించింది. అలాగే కంపెనీ రగ్గడ్ మోడల్ బొలెరో సిరీస్ కూడా 9,115 యూనిట్ల అమ్మకాలతో 21.89 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఎలక్ట్రిక్ కార్లకు భలే డిమాండ్
ఇక ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మహీంద్రా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. కంపెనీ కొత్తగా తెచ్చిన మహీంద్రా XEV 9S ఈవీ కారు మొదటిసారిగా పూర్తి నెల అమ్మకాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. జూన్ నెలలో దీనివి ఏకంగా 4,018 యూనిట్లు అమ్ముడయ్యాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో దీని వాటా 6.65 శాతంగా ఉంది. అయితే, మరో ఈవీ మోడల్ XEV 9e విక్రయాలు మాత్రం 2,006 యూనిట్లకు పడిపోయి 28.56 శాతం క్షీణతను చూశాయి. అలాగే బిఈ 6 మోడల్ 1,150 యూనిట్ల అమ్మకాలతో స్వల్పంగా 4.41 శాతం తగ్గింది. కంపెనీ పాత ఈవీ మోడల్ ఎక్స్‌యూవీ400 ఆదరణ పూర్తిగా తగ్గిపోవడంతో కేవలం 31 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. వీటన్నింటి మధ్య మహీంద్రాకు చెందిన లగ్జరీ ఎమ్‌పీవీ మరాజో కారుకు జూన్ నెల అస్సలు కలిసిరాలేదు. ఈ మోడల్‌కు సంబంధించిన ఒక్క కార్ కూడా అమ్ముడుపోకపోవడం గమనార్హం.