Mahindra Scorpio N : బిగ్ డాడీ ఈజ్ బ్యాక్.. కొత్త హంగులతో మహీంద్రా స్కార్పియో ఎన్ 2026.. ఎప్పుడంటే?

కొత్త హంగులతో మహీంద్రా స్కార్పియో ఎన్ 2026.. ఎప్పుడంటే?

Update: 2026-04-10 12:02 GMT

Mahindra Scorpio N :భారతీయ ఎస్‌యూవీ ప్రపంచంలో బిగ్ డాడీగా పేరుగాంచిన మహీంద్రా స్కార్పియో ఎన్, ఇప్పుడు సరికొత్త అవతారమెత్తబోతోంది. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెటూర్లలో కూడా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఈ కారు, టాటా హారియర్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి ఆధునిక కార్ల పోటీని తట్టుకునేలా సరికొత్త ఫీచర్లతో స్కార్పియో ఎన్ 2026 ఫేస్‌లిఫ్ట్ రూపంలో రాబోతోంది. కేవలం లుక్ మాత్రమే కాకుండా, టెక్నాలజీ పరంగా కూడా ఈ కారు నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందని సమాచారం.

మహీంద్రా స్కార్పియో ఎన్ 2026 ఫేస్‌లిఫ్ట్‌లో బాహ్య రూపంలో కొన్ని కీలక మార్పులు ఉండబోతున్నాయి. దీని సిగ్నేచర్ సిల్హౌట్ అలాగే ఉన్నప్పటికీ, హెడ్‌లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, టెయిల్ లైట్లను మరింత స్టైలిష్‌గా రీడిజైన్ చేయనున్నారు. కొత్త బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్, కొత్త రంగుల్లో ఈ కారు మెరిసిపోనుంది. బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాసిస్‌ను అలాగే ఉంచడం వల్ల దీని ఆఫ్‌రోడింగ్ సామర్థ్యంలో ఎలాంటి మార్పు ఉండదు.

కారు లోపల ఇంటీరియర్ ఇప్పుడు మరింత లగ్జరీగా మారబోతోంది. ముఖ్యంగా మహీంద్రా థార్ రాక్స్ నుంచి స్ఫూర్తి పొందిన 10.25 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ కారులో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్, ప్రీమియం సీట్ అప్హోల్స్టరీ మరియు అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. కస్టమర్ల సౌకర్యం కోసం కేబిన్ లేఅవుట్‌లో మరిన్ని మార్పులు చేయనున్నారు.

స్కార్పియో ఎన్ ఇప్పటికే పవర్‌ఫుల్ ఇంజిన్లతో దూసుకుపోతోంది, కాబట్టి ఇంజిన్ విభాగంలో మహీంద్రా ఎలాంటి మార్పులు చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు అలాగే కొనసాగుతాయి. ట్రాన్స్‌మిషన్ పరంగా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఆఫ్‌రోడ్ ప్రియుల కోసం టాప్ ఎండ్ వేరియంట్లలో 4X4 సిస్టమ్ కూడా ఉంటుంది.

మహీంద్రా తన స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆగస్టు 2026 నాటికి మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుత ధరలతో పోలిస్తే కొత్త మోడల్ ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం, 2026 స్కార్పియో ఎన్ ధర రూ.14 లక్షల నుంచి రూ.26 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ ధరలు రూ.13.2 లక్షల నుంచి రూ.23.99 లక్షల మధ్య ఉన్నాయి. ఫీచర్లు, లుక్ మారడంతో ఈ ధర పెంపును కస్టమర్లు పెద్దగా పట్టించుకోకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News