Mahindra Thar: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ మహీంద్రా థార్ ఇప్పుడు సరికొత్త రూపంలో మార్కెట్లోకి వచ్చింది. కంపెనీ ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు థార్ ఓజీ అని నామకరణం చేసింది. దీని డిజైన్, ప్లాట్‌ఫారమ్, సస్పెన్షన్, ఫీచర్లలో అనేక పెద్ద మార్పులు చేశారు. ఈ కొత్త ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.10.32 లక్షలుగా నిర్ణయించారు. ఫోర్స్ గూర్ఖా, మారుతి సుజుకి జిమ్నీ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

కొత్త మహీంద్రా థార్ ఓజీ ముందు భాగంలో కొత్త గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, సీ-షేప్ డీఆర్‌ఎల్‌లు, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్‌ను అందించారు. అలాగే కొత్త 19 అంగుళాల అలాయ్ వీల్స్, వెనుక భాగంలో ఓజీ బ్యాడ్జింగ్‌ను అమర్చారు. పాత కలర్స్‌తో పాటు ఇప్పుడు కొత్తగా ఆర్టెమిస్ సిల్వర్, జీన్స్ బ్లూ అనే రెండు కొత్త రంగుల ఆప్షన్లలో కూడా ఇది లభిస్తుంది. ఇంటీరియర్‌లో కొత్త ట్రఫుల్ బ్రౌన్ లెదరేట్ అపోహ్లాస్ట్రీ, సెకండ్ రో కోసం ఆర్మ్రెస్ట్ వంటి సౌకర్యాలు కల్పించారు.

భద్రత విషయంలో కంపెనీ చాలా పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. ఇకపై 3-డోర్ థార్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి. సైడ్ ఇంప్యాక్ట్ సమయంలో ప్రయాణికుల తలకు, ఛాతీకి రక్షణగా నిలిచే హెచ్‌పీటీఎస్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ను ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్స్, ఈఎస్‌పీ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హోల్డ్ వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు అందించడం విశేషం.

ఈ ఎస్‌యూవీలో మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో పాటు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఇచ్చారు. RWD లేదా 4WD ఆప్షన్లలో లభించే ఈ కొత్త థార్ ఓజీ LXT, ZXT వంటి వివిధ వేరియంట్లలో విభిన్న ధరలతో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Tags: