Mahindra : కొండలు, కోనలు ఏవైనా సరే.. దూసుకుపోవడమే..భారత సైన్యం కోసం మహీంద్రా యుద్ధనౌక
భారత సైన్యం కోసం మహీంద్రా యుద్ధనౌక
Mahindra : భారత సైన్యం కోసం సరికొత్త అస్త్రాలను సిద్ధం చేయడంలో మహీంద్రా డిఫెన్స్ ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా ఈ సంస్థ సైన్యం కోసం ఒక భీకరమైన వాహనాన్ని తయారు చేసింది. అదే మహీంద్రా ఏటీవీ. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు నెట్టింట ఈ వాహనం తెగ వైరల్ అవుతోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా, ఎంతటి కఠినమైన దారుల్లోనైనా దూసుకుపోయేలా దీనిని రూపొందించారు.
ఈ కొత్త ఏటీవీ వాహనం చూడటానికి మనం రోడ్లపై చూసే మహీంద్రా థార్ రాక్స్ లాగే ఉన్నా, దీని వెనుక అసలు కథ వేరే ఉంది. దీనిని పూర్తిగా సైనిక అవసరాలకు అనుగుణంగా మార్చేశారు. ప్రదర్శన కంటే పనితనం మీదనే కంపెనీ ఎక్కువ దృష్టి పెట్టింది. అందుకే దీనికి ఎటువంటి అలంకరణలు, అనవసరమైన హంగులు ఉండవు. ప్రతి ఒక్క పార్టుకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. గట్టి రోల్ కేజ్, మెటల్ బంపర్లు, అదనపు టైర్లను ఉంచడానికి ప్రత్యేక స్థలం, ఇంధనం కోసం జెర్రీక్యాన్ హోల్డర్లు ఇందులో ఉన్నాయి.
ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
ఈ వాహనం ఫోటోలను ఎక్స్ లో షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "దీనిలో ఏదీ అదనంగా లేదు, ఎటువంటి అలంకరణలు లేవు. కేవలం పనిపైనే దృష్టి. ప్రతి ఇంచ్ క్లియరెన్స్, ప్రతి మౌంట్‌కు ఒక పని ఉంది" అని ఆయన పేర్కొన్నారు. ఈ వాహనాన్ని యుద్ధ క్షేత్రంలోకి పారాచూట్ సహాయంతో జారవిడచవచ్చు . అలాగే దీనిపై మెషిన్ గన్ అమర్చుకోవడానికి గన్ మౌంట్, కారు కింద భాగం దెబ్బతినకుండా అండర్ బాడీ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు.
ఈ భీకర వాహనానికి ప్రాణం పోసేది దాని 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇది సుమారు 172 హార్స్‌పవర్ శక్తిని, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే భారీ ఆయుధాలను, మందుగుండు సామగ్రిని మోసుకుంటూ ఎత్తైన కొండల మీద కూడా సునాయాసంగా ప్రయాణించగలదు. దీనిని బెంగళూరుకు చెందిన ప్రాడ్ 4x4 అనే సంస్థతో కలిసి మహీంద్రా రూపొందించింది. ఇటీవల జరిగిన రక్ష త్రివేణి సంగమం అనే ఈవెంట్ లో దీనిని తొలిసారిగా ప్రదర్శించారు.
సైన్యం ఉపయోగించే వాహనాలు ఏ వాతావరణంలోనైనా పనిచేయాలి. ఎముకలు కొరికే చలి ఉండే హిమాలయాల నుంచి, మండిపోయే రాజస్థాన్ ఎడారుల వరకు ఈ మహీంద్రా ఏటీవీ సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని టెన్డమ్ టైర్ సెటప్, గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల రాళ్ల మీద, బురదలో కూడా కారు చిక్కుకుపోకుండా సాగిపోతుంది. మన దేశ రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కింద తయారైన ఇలాంటి వాహనాలు చేరడం భారత సైన్యానికి కొండంత బలాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.