Mahindra XEV 9e Cineluxe : డీలర్‌షిప్‌లకు చేరుకున్న మహీంద్రా XEV 9e సినీలక్స్.. డెలివరీలకు సర్వం సిద్ధం

డెలివరీలకు సర్వం సిద్ధం

Update: 2026-03-25 08:29 GMT

Mahindra XEV 9e Cineluxe : భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం సృష్టిస్తున్న మహీంద్రా, తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా XEV 9e సినీలక్స్ ఎడిషన్‎ను డీలర్‌షిప్‌ల వద్దకు చేర్చడం ప్రారంభించింది. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల కోసం కస్టమర్లు నెలల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది, కానీ బుకింగ్స్ మొదలైన కొద్ది రోజుల్లోనే ఈ కారు డీలర్‌షిప్‌ల వద్దకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమా హాల్‌ను తలపించే ఫీచర్లతో, విలాసవంతమైన ఇంటీరియర్‌తో వస్తున్న ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఏమిటీ సినీలక్స్ ఎడిషన్ ప్రత్యేకత?

మహీంద్రా XEV 9e లోని టాప్ ఎండ్ ప్యాక్ త్రీ వేరియంట్‌ను మరింత విలాసవంతంగా తీర్చిదిద్ది ఈ సినీలక్స్ ఎడిషన్ ను రూపొందించారు. ఇంజిన్ లేదా పవర్‌లో మార్పులు చేయకుండా, డిజైన్, ఇంటీరియర్‌ను పూర్తిగా మార్చేశారు. ఈ ఎడిషన్ లో ఎక్స్‌టీరియర్ కోసం శాటిన్ బ్లాక్ లేదా శాటిన్ వైట్ అనే కొత్త రంగులను ఇచ్చారు. అలాగే ఇది ఒక ప్రత్యేకమైన ఎడిషన్ అని తెలియజేయడానికి కారుపై స్పెషల్ సినీలక్స్ బ్యాజింగ్‌ను కూడా అమర్చారు. చూస్తుంటేనే కారు చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తోంది.

లోపల అంతా విలాసమే

కారు లోపలికి వెళ్తే మీకు సరికొత్త ప్రపంచం కనిపిస్తుంది. చెస్ట్రట్ బ్రౌన్, నాక్టర్న్ బ్లాక్ కలర్ థీమ్‌తో ఇంటీరియర్ డిజైన్ అదిరిపోయింది. ప్రధానంగా ఇందులో ట్రిపుల్ హెచ్‌డీ డిస్‌ప్లే సెటప్ ఉంది, ఇది డ్యాష్‌బోర్డ్ అంతా వ్యాపించి ఉంటుంది. ఇక సంగీత ప్రియుల కోసం ఇందులో ఏకంగా 16 స్పీకర్ల ఆడియో సిస్టమ్ ను అమర్చారు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చిన్న సినిమా థియేటర్‌లో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. దీనికి తోడు యాంబియంట్ లైటింగ్ కారుకు మరింత అందాన్ని ఇస్తుంది.

పవర్‌ఫుల్ బ్యాటరీ, రేంజ్

మెకానికల్ పరంగా చూస్తే ఈ కారు పాత మోడల్ లాగే పవర్‌ఫుల్ గా ఉంటుంది. ఇందులో 79 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 656 కిలోమీటర్ల రేంజ్ (ARAI) ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది రియర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో వస్తుంది. సుమారు 282 BHP పవర్, 380 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే సిటీలో మాత్రమే కాకుండా లాంగ్ ట్రిప్పులకు కూడా ఈ కారు పక్కాగా సరిపోతుంది. ఇందులో వివిధ రకాల డ్రైవింగ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ధర, మార్కెట్ పోటీ

భారత మార్కెట్లో మహీంద్రా XEV 9e సినీలక్స్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.29.35 లక్షలుగా ఉంది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీ ఇస్తోంది. కొన్ని మోడళ్లతో పోలిస్తే ధర కొంచెం ఎక్కువగా అనిపించినా, ఇందులో ఇచ్చే ఫీచర్లు, 16 స్పీకర్ల సౌండ్ సిస్టమ్ వంటి అప్‌గ్రేడ్స్ ఆ ధరకు న్యాయం చేస్తున్నాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఎలక్ట్రిక్ కార్లలో లగ్జరీ, టెక్నాలజీ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఆప్షన్.

Tags:    

Similar News