Mahindra : 30 వేల బుకింగ్స్.. 500 కి.మీ మైలేజీ.. మహింద్రా ఎలక్ట్రిక్ విప్లవం మాములుగా లేదుగా
మహింద్రా ఎలక్ట్రిక్ విప్లవం మాములుగా లేదుగా
Mahindra : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. స్వదేశీ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహింద్రా అండ్ మహింద్రా తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 9eలో అత్యంత విలాసవంతమైన సినీలక్స్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ధరను రూ.29.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కారు బుకింగ్స్ నేటి నుంచే మహింద్రా షోరూమ్‌లలో లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లో ప్రారంభమయ్యాయి. మార్చి 10, 2026 నుంచి కస్టమర్లకు డెలివరీలు అందుతాయని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ సినీలక్స్ ఎడిషన్ పేరుకు తగ్గట్టుగానే లోపల ఒక సినిమా థియేటర్ లాంటి అనుభూతిని ఇస్తుంది. దీని ఇంటీరియర్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. డ్యాష్‌బోర్డ్ మొత్తం విస్తరించి ఉండే కోస్ట్-టు-కోస్ట్ ట్రిపుల్ హెచ్‌డీ స్క్రీన్‌లు దీని ప్రధాన ఆకర్షణ. ప్రయాణంలో అదిరిపోయే మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు, ఇది డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో వస్తుంది. అంతేకాకుండా, కారు లోపల ఏకంగా 1.6 కోట్ల రంగుల కాంబినేషన్లతో కూడిన యాంబియంట్ లైటింగ్, ఆకాశం మొత్తం కనిపించేలా భారీ పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.
లుక్స్ పరంగా కూడా ఈ ఎడిషన్ చాలా క్లాసీగా ఉంటుంది. కంపెనీ దీనిని శాటిన్ బ్లాక్, శాటిన్ వైట్ అనే రెండు కొత్త ప్రీమియం రంగుల్లో తీసుకొచ్చింది. కారు లోపల చెస్ట్‌నట్ బ్రౌన్, నాక్టర్న్ బ్లాక్ కలర్ లెదరెట్ సీట్లు లగ్జరీ లుక్‌ను ఇస్తాయి. టెక్నాలజీ విషయానికి వస్తే.. ఇందులో ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, ఆటో పార్క్ అసిస్ట్, డిజిటల్ కీ వంటి ఫీచర్లు ఉన్నాయి. వెరైటీగా ఇందులో మన పెంపుడు జంతువుల కోసం పా-పాల్ వంటి లైఫ్‌స్టైల్ మోడ్‌లను కూడా ఇచ్చారు.
ఇక పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే.. ఇందులో 79 kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోడ్డు మీద ఏకంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ అద్భుతమైన ఫీచర్ల వల్లే దీనికి ICOTY 2026లో గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కింది. మహింద్రా ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. గత 70 రోజుల్లోనే కంపెనీ 10,000 కార్లను డెలివరీ చేసింది. ఇప్పటివరకు ఈ మోడల్‌కు 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ రావడం విశేషం.