Mahindra : క్రెటాతో ఢీ, టాటా సియెర్రాకు పోటీ..మహీంద్రా కొత్త SUV వచ్చేస్తోంది
మహీంద్రా కొత్త SUV వచ్చేస్తోంది
Mahindra : మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ త్వరలో ఐసీఈ(ICE), ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో అనేక కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యం చెలాయిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించాలని మహీంద్రా నిర్ణయించింది. ఈ కొత్త ఎస్‌యూవీ కంపెనీ అత్యాధునిక NU_IQ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతుందని భావిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ పెట్రోల్-డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లకు మద్దతు ఇచ్చే విధంగా రూపొందించబడింది. ఈ కొత్త ఎస్‌యూవీ, ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రదర్శించిన విజన్ ఎస్ కాన్సెప్ట్ ఉత్పత్తి వెర్షన్ కావచ్చని, లేదా దానిపై ఆధారపడి ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
విజన్ ఎస్ కాన్సెప్ట్ చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో మహీంద్రా ప్రత్యేకమైన ట్విన్ పీక్స్ లోగో ఉంది. దీనికి ఇరువైపులా నిలువుగా మూడు చొప్పున ఎల్‌ఈడీ లైట్లు అమర్చబడ్డాయి. ఇందులో రివర్స్ L ఆకారంలో ఉన్న హెడ్‌ల్యాంప్‌లు, స్పోర్టీ బంపర్, పిక్సెల్ ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్‌లు, ఉబ్బెత్తుగా ఉన్న బోనెట్ ఉన్నాయి. పక్క నుంచి చూస్తే, ఈ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ రైడింగ్‌కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది అధిక గ్రౌండ్ క్లియరెన్స్, డోర్స్, వీల్ ఆర్చెస్ కింద హెవీ క్లాడింగ్, 19-అంగుళాల పెద్ద టైర్లు, ఎరుపు కాలిపర్స్‌తో కూడిన డిస్క్ బ్రేక్‌లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వెనుక భాగంలో రివర్స్ L ఆకారపు టెయిల్ లైట్స్, టెయిల్‌గేట్‌పై అమర్చిన స్పేర్ వీల్ కనిపిస్తాయి. అయితే కొన్ని ఆఫ్-రోడ్ డిజైన్ ఎలిమెంట్స్ ఉత్పత్తి మోడల్‌లో యాక్సెసరీలుగా మారవచ్చు.
మహీంద్రా విజన్ ఎస్ కాన్సెప్ట్ లోపల VISION S అని రాసి ఉన్న కొత్త స్టీరింగ్ వీల్, NU UX సాఫ్ట్‌వేర్‌తో కూడిన సెంట్రల్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సీట్లు, డోర్ ట్రిమ్స్, డాష్‌బోర్డ్‌పై డ్యూయల్-టోన్ అప్హోల్‌స్టరీ లభిస్తుంది. ఈ కాన్సెప్ట్‌లో ఫ్యూయల్ క్యాప్ ఉండటం వలన ఇది ఐసీఈ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మహీంద్రా క్రెటా పోటీదారు ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఈ కొత్త ఎస్‌యూవీ ఉత్పత్తి వెర్షన్ 2027 లో మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. అప్పటికి టాటా సియెర్రా కూడా మార్కెట్‌లోకి రావచ్చని భావిస్తున్నారు.