Manual Cars: ఆటోమేటిక్ కార్లు వద్దు.. మ్యాన్యువల్ ఎస్‌యూవీలే ముద్దు.. కస్టమర్ల అసలు సీక్రెట్ ఇదే
కస్టమర్ల అసలు సీక్రెట్ ఇదే
Manual Cars: ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయనే ఆలోచనతో ఆటోమేటిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో ఊహించని నిజం వెలుగులోకి వచ్చింది. 2026 మొదటి అర్ధభాగంలో అమ్ముడైన మిడ్-సైజ్ ఎస్‌యూవీల్లో ఏకంగా 71.4 శాతం మంది కొనుగోలుదారులు మ్యాన్యువల్ మోడల్స్‌నే ఎంచుకోవడం విశేషం.
సేల్స్ గణాంకాల్లో మ్యాన్యువల్ ఆధిపత్యం
నగరాల్లో విపరీతంగా పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా క్లచ్ నొక్కాల్సిన పనిలేని ఆటోమేటిక్ కార్లకు ఆదరణ పెరుగుతోందని అందరూ భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయి మార్కెట్ లెక్కలు మాత్రం పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయి. జేటో డైనమిక్స్ నివేదిక ప్రకారం..2026 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో విక్రయమయిన మొత్తం మిడ్-సైజ్ ఎస్‌యూవీ వాహనాల్లో మ్యాన్యువల్ మోడళ్ల వాటా ఏకంగా 71.4 శాతంగా నమోదైంది. ఆటోమేటిక్ కార్ల వాటా కేవలం 28.6 శాతానికే పరిమితమైంది. దేశంలో అమ్ముడవుతున్న ప్రతి 10 ఎస్‌యూవీల్లో దాదాపు 7 వాహనాలు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్నవే కావడం గమనార్హం.
రూ.1.5 లక్షల ధర వ్యత్యాసమే ప్రధాన కారణం
ఈ స్థాయి ఆధిపత్యానికి మోడళ్ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే ప్రధాన కారణమని తెలుస్తోంది. సాధారణంగా పెట్రోల్ మ్యాన్యువల్, పెట్రోల్ ఆటోమేటిక్ మోడళ్ల మధ్య సగటున రూ. 1.5 లక్షల వరకు వ్యత్యాసం ఉంటుంది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ కొనుగోలు చేసే చాలామంది కస్టమర్లు ఇప్పటికే తమ బడ్జెట్‌ను దాటి వాహనాన్ని ఎంచుకుంటారు. అటువంటి సమయంలో కేవలం ఆటోమేటిక్ సిస్టమ్ కోసం అదనంగా రూ.1.5 లక్షలు వెచ్చించడం అందరికీ సాధ్యపడదు. బ్యాంకు రుణంపై కారు కొనుగోలు చేసేవారికి ఈ అదనపు మొత్తం నెలవారీ ఈఎంఐపై నేరుగా ప్రభావం చూపుతుంది. అదే మొత్తంతో హైఎండ్ ఫీచర్లు ఉన్న మ్యాన్యువల్ వేరియంట్ లభిస్తుండటంతో కొనుగోలుదారులు మ్యాన్యువల్ వైపే మొగ్గు చూపుతున్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నా మారని అలవాటు
మెట్రో నగరాల్లో రోజువారీ ప్రయాణాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లను ఎదుర్కొనే వారికి ఆటోమేటిక్ కార్లు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. పదే పదే గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండా ట్రావెలింగ్ బాధలను తగ్గిస్తాయి. అయినప్పటికీ అనేకమంది డ్రైవర్లు మ్యాన్యువల్ కార్లను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. దశాబ్దాలుగా మ్యాన్యువల్ వాహనాలు నడపడం అలవాటు కావడం, అదనపు సొమ్ము వెచ్చించాల్సిన అవసరం లేదని భావించడం ఇందుకు కారణం. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో సరసమైన నిర్వహణ ఖర్చుతో కూడిన మ్యాన్యువల్ కార్లకే ఇప్పటికీ అత్యధిక డిమాండ్ ఉంది.
డిఫరెంట్ టెక్నాలజీ.. భవిష్యత్తు అంచనాలు
ఆటోమేటిక్ విభాగంలో ఎఎమ్‌టి, సివిటి, టార్క్ కన్వర్టర్, డ్యూయల్-క్లచ్ వంటి పలు రకాల గేర్‌బాక్స్ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. ఎఎమ్‌టి మినహా మిగిలిన మోడ్రన్ టెక్నాలజీల ధరలు ఎక్కువగా ఉండటం కారు మొత్తం వ్యయాన్ని పెంచేస్తోంది. ప్రస్తుతానికి మ్యాన్యువల్ కార్లు ముందంజలో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో మార్పులు రానున్నాయి. క్రిసిల్ ప్రతినిధి హేమల్ ఎన్ ఠక్కర్ అంచనా ప్రకారం 2030 నాటికి ఎస్‌యూవీ విక్రయాల్లో ఆటోమేటిక్ కార్ల వాటా 50 శాతానికి పైగా పెరుగుతుంది. 2026 మొదటి అర్ధభాగం ఎస్‌యూవీ విక్రయాల్లో పెట్రోల్ 50.8 శాతం, డీజిల్ 31.3 శాతం, సీఎన్‌జీ 10.8 శాతం, ఈవీ వాహనాలు 7.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి.