EV Discounts : ఎలక్ట్రిక్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. మార్చి నెలలో లక్షల రూపాయల డిస్కౌంట్
మార్చి నెలలో లక్షల రూపాయల డిస్కౌంట్
EV Discounts : భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాల హవానే కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం తగ్గించుకోవాలనుకునే వారు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా ఒక మంచి ఎలక్ట్రిక్ కారును మీ ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, అందుకు మార్చి నెల కంటే ఉత్తమమైన సమయం మరొకటి లేదు. ఎందుకంటే, ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ ఈవీ మోడళ్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. టాటా మోటార్స్ నుంచి హ్యుందాయ్ వరకు ఏయే కార్లపై ఎంత సేవింగ్స్ చేసుకోవచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టాటా మోటార్స్ అదిరిపోయే ఆఫర్లు
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ తన కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. టాటా టయాగో ఈవీ కొనుగోలుపై సుమారు రూ.2.1 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. దేశంలోనే పాపులర్ అయిన నెక్సాన్ ఈవీ పై రూ.1.2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే అందరికంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే.. టాటా కర్వ్ ఈవీ పై ఏకంగా రూ.3.8 లక్షల వరకు ప్రయోజనాలు అందుకోవచ్చు. ప్రస్తుతం టాటా వద్ద 6 ఎలక్ట్రిక్ మోడల్స్ ఉన్నాయి, త్వరలోనే సియెర్రా ఈవీ కూడా రంగంలోకి దిగబోతోంది.
మహీంద్రా, ఎంజీ మోటార్స్ ధమాకా
మహీంద్రా సంస్థ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XUV400 పై దాదాపు రూ.4 లక్షల భారీ డిస్కౌంట్ ఇస్తోంది. అంతేకాకుండా, కొత్తగా వచ్చిన BE 6, XEV 9e మోడళ్లపై కూడా రూ.2.95 లక్షల వరకు లాభాలు పొందవచ్చు. ఇక ఎంజీ మోటార్స్ విషయానికి వస్తే, తమ విండ్‌సర్ ఈవీ కొనుగోలుదారులకు ఒక సంవత్సరం పాటు ఉచిత పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. బిజినెస్ యూజర్లు అయితే పన్ను ప్రయోజనాలతో పాటు రూ.13.17 లక్షల వరకు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.
హ్యుందాయ్ అయోనిక్ 5పై ఏకంగా రూ.10 లక్షల తగ్గింపు
ఈ మార్చి నెలలో అన్నిటికంటే పెద్ద డిస్కౌంట్ హ్యుందాయ్ నుంచే లభిస్తోంది. వారి ప్రీమియం ఎలక్ట్రిక్ కారు Ioniq 5 పాత మోడళ్లపై దాదాపు రూ.10 లక్షల వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. దీనికి ప్రధాన కారణం, కంపెనీ త్వరలోనే దీని కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేయడమే. స్టాక్ క్లియర్ చేయడం కోసం హ్యుందాయ్ ఈ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. లగ్జరీ ఈవీ కావాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.
మార్చిలోనే ఈవీ కొనడం ఎందుకు లాభదాయకం?
సాధారణంగా మార్చి నెలాఖరులో ఆటోమొబైల్ కంపెనీలు తమ పాత స్టాక్ క్లియర్ చేయడానికి, వార్షిక అమ్మకాల లక్ష్యాలను చేరుకోవడానికి భారీ డిస్కౌంట్లు ఇస్తాయి. దీనికి తోడు, బిజినెస్ యజమానులు మార్చి 31లోపు ఈవీ కొనుగోలు చేస్తే ఆదాయపు పన్ను చట్టం కింద అధిక డిప్రిసియేషన్ ప్రయోజనాలను పొందవచ్చు. ఇది మీ మొత్తం పెట్టుబడి ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి, పర్యావరణానికి మేలు చేస్తూ, మీ జేబుకు కూడా ఆదా చేయాలనుకుంటే ఈ వారమే మీ ఫేవరెట్ ఈవీని బుక్ చేసుకోండి.