Maruti 800: ఒకప్పుడు సొంతంగా కారు కొనడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద కల. ఆ కలను నిజం చేసిన కార్లలో మారుతి 800కు ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ ధర, మంచి మైలేజీ, సులభంగా నడపగలిగే సౌకర్యం, తక్కువ నిర్వహణ ఖర్చుతో ఈ కారు లక్షలాది కుటుంబాలకు చేరువైంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు భారత రోడ్లపై తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ఈ చిన్న కారు మరోసారి వార్తల్లో నిలిచింది. మారుతి 800కు ప్రతిష్ఠాత్మక FIVA World Vehicle Heritage Award లభించింది. ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ కారుగా మారుతి 800 గుర్తింపు పొందింది.

ప్రపంచ స్థాయి గౌరవం ఎందుకు లభించింది?

మారుతి 800కు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం భారత కార్ల మార్కెట్‌లో తీసుకొచ్చిన మార్పు. ఒకప్పుడు ఖరీదైన కార్లకే పరిమితమైన ఆటోమొబైల్ రంగంలోకి సామాన్య కుటుంబాలను తీసుకొచ్చిన ఘనత దీనికి ఉంది. మంచి నాణ్యతతో కూడిన కార్లను భారత్‌లోనూ తయారు చేయవచ్చని నిరూపించింది. FIVA అంటే Fédération Internationale des Véhicules Anciens. ఇది చారిత్రక వాహనాల పరిరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ సంస్థ. ప్రపంచ వాహన చరిత్రలో ప్రత్యేక ప్రభావం చూపిన కార్లకు ఈ సంస్థ గుర్తింపు ఇస్తుంది. ఈ పురస్కారం కోసం 20 దేశాలకు చెందిన 21 చారిత్రక వాహనాలను ఎంపిక చేశారు. అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్లోవేనియా వంటి దేశాలకు చెందిన వాహనాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇలాంటి అంతర్జాతీయ వేదికపై మారుతి 800కు చోటు దక్కడం భారత ఆటోమొబైల్ రంగానికి గర్వకారణం.

1983లో విడుదల.. అప్పట్లో ధర రూ.52,500

మారుతి 800ను 1983 డిసెంబర్‌లో భారత మార్కెట్లో విడుదల చేశారు. అప్పట్లో దేశంలో ఫియట్, అంబాసిడర్ వంటి కార్లు ఎక్కువగా కనిపించేవి. ఇలాంటి సమయంలో చిన్న పరిమాణం, ఆధునిక డిజైన్‌తో మారుతి 800 వినియోగదారులను ఆకట్టుకుంది. ఈ కారు బుకింగ్స్ 1983 ఏప్రిల్ 9న ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే సుమారు 1.20 లక్షల మంది రూ.10 వేల చొప్పున టోకెన్ చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందంటే కొంతమంది వినియోగదారులు కారు డెలివరీ కోసం ఏకంగా మూడేళ్ల వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ఢిల్లీలో విడుదలైన సమయంలో దీని ధర రూ.52,500 మాత్రమే. నేటి ధరలతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువగా అనిపించినా, అప్పట్లో మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం పెద్ద విషయమే.

ఇందిరా గాంధీ చేతుల మీదుగా తొలి కారు డెలివరీ

మారుతి 800 చరిత్రలో 1983 డిసెంబర్ 14 ఒక ప్రత్యేకమైన రోజు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తొలి మారుతి 800 కారు తాళాలను హర్‌పాల్ సింగ్‌కు అందించారు. ఆయన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసేవారు. ఈ సంఘటన భారత ఆటోమొబైల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ కూడా ఈ కారు ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రారంభంలో చాలా చిన్న స్థాయిలో మొదలైన మారుతి 800, భారతదేశం ఆధునిక కార్ల తయారీలో నాణ్యత సాధించగలదని నిరూపించిందని తెలిపారు. 1987లోనే ఈ కారు తొలి యూనిట్లను యూరప్‌కు ఎగుమతి చేసినట్లు ఆయన వెల్లడించారు.

27 లక్షలకు పైగా కార్ల అమ్మకాలు

మారుతి 800 ప్రజాదరణకు దాని అమ్మకాల గణాంకాలే నిదర్శనం. ఈ కారు తన మొత్తం ప్రయాణంలో 27 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడైంది. తక్కువ ధరతో పాటు మంచి మైలేజీ, సులభమైన డ్రైవింగ్, తక్కువ సర్వీస్ ఖర్చులు దీనికి కలిసొచ్చాయి. చిన్న కుటుంబాలకు ఇది మంచి ఎంపికగా నిలిచింది. ఉత్పత్తి విషయంలోనూ మారుతి 800 అనేక మైలురాళ్లు అందుకుంది. 1986-87లోనే ఏడాదికి లక్ష కార్ల ఉత్పత్తిని దాటింది. 1992-93లో ఐదు లక్షలు, 1996-97లో పది లక్షలు, 2002-03లో 20 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది.

2014లో ఉత్పత్తి నిలిపివేత

భారత రోడ్లపై దాదాపు మూడు దశాబ్దాల పాటు సందడి చేసిన మారుతి 800 ఉత్పత్తి 2014లో నిలిచిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కాలుష్య నియంత్రణ నిబంధనలు అమల్లోకి రావడంతో ఈ పాత మోడల్‌ను కొనసాగించడం కంపెనీకి కష్టంగా మారింది. ముఖ్యంగా BS4 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో కంపెనీ ఈ కారు తయారీని నిలిపివేసింది.

Tags: