Maruti Baleno : కారు లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి బలేనో ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారైంది. సెప్టెంబర్ 5న సరికొత్త రూపంలో ఈ మోడల్ పలకరించబోతోంది. 2022లో వచ్చిన సెకండ్ జనరేషన్ తర్వాత అందుబాటులోకి వస్తున్న అతిపెద్ద అప్‌డేట్ ఇది. ఎస్‌యూవీల హవా నడుస్తున్న సమయంలోనూ క్రేజ్ తగ్గని బలేనో, ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌తో మరిన్ని రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతోంది. టెస్టింగ్ సమయంలో ప్రత్యక్షమైన వివరాల ప్రకారం బలేనో ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో భారీ మార్పులు చేశారు. రెండు హెడ్‌లాంప్‌లను అనుసంధానించేలా క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన కొత్త ఫ్రంట్ గ్రిల్ అమర్చారు. హెడ్‌లాంప్స్ పాత ఆకారాన్నే కొనసాగిస్తూ బూమరాంగ్ ఆకారంలో ఉండే ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను పొందుపరిచారు. ఫ్రంట్ బంపర్‌ను రీడిజైన్ చేయడంతో కారుకు మరింత స్పోర్టీ లుక్ వచ్చింది.

సైడ్ ప్రొఫైల్‌లో ప్రధానంగా సరికొత్త డిజైన్ కలిగిన అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వెనుక భాగంలో కొత్త బంపర్ ఇచ్చినా టెయిల్ లాంప్స్, రూఫ్ స్పాయిలర్ పాత శైలినే తలపిస్తాయి. కేబిన్ లోపల 9-ఇంచీల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు కొత్త సీట్ అపోల్స్టరీ రానుంది. ఈసారి విభాగంలోనే తొలిసారిగా సింగిల్ ప్యాన్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ ఆప్షన్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.

ఇంజిన్ విభాగంలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఇప్పటికే ఉన్న 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే ఇందులో కొనసాగిస్తారు. ఇది 90 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఇంధన పొదుపు కోరుకునే వారి కోసం సీఎన్‌జీ వర్షన్ అందుబాటులో ఉంటుంది. సీఎన్‌జీ మోడల్ 77.5 హెచ్‌పీ పవర్‌ను ఇస్తుంది, ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

Tags: