Car Waiting Period: కారు కొనే ముందు ఈ విషయం తెలుసుకోండి..కంపెనీల డెలివరీ సమయం ఇవే
డెలివరీ సమయం ఇవే
Car Waiting Period: కొత్త కారు కొనుగోలు చేయాలనుకున్న ప్రతి ఒక్కరి మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఈ బండి మన ఇంటికి ఎప్పుడు వస్తుంది అనేది. కారు బుక్ చేసిన వెంటనే డెలివరీ దక్కడం కొన్నిసార్లు కుదరదు, కొన్ని వాహనాలకు వారాల తరబడి లేదా నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు అక్టోబర్ 2026లో మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన మారుతి బ్రెజ్జా, మహీంద్రా థార్ లేదా టాటా నెక్సాన్ వంటి కార్లను కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, ముందే వాటి వెయిటింగ్ పీరియడ్ గురించిన స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రాంతాలు అలాగే డీలర్ల వద్ద ఉన్న స్టాక్ ఆధారంగా ఈ డెలివరీ సమయాల్లో మార్పులు ఉంటాయి.
మారుతి బ్రెజా వెయిటింగ్ పీరియడ్
రోజువారీ ప్రయాణాలకు, కుటుంబంతో కలిసి తిరిగేందుకు అనువైన కారుగా మారుతి బ్రెజ్జాకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఢిల్లీలో ఈ కారును అక్టోబర్‌లో బుక్ చేసుకుంటే సుమారు 1 నుంచి 2 నెలల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇతర నగరాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. చెన్నై అలాగే జైపూర్ వంటి ప్రాంతాలలో బ్రెజ్జా కేవలం 2 నుంచి 4 వారాల్లోపే కస్టమర్ల చేతికి అందుతోంది. మరోవైపు బెంగళూరు, చండీగఢ్, కోయంబత్తూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రం సుమారు 2 నెలల వరకు సమయం పట్టవచ్చు. ఒకవేళ మీకు త్వరగా కారు కావాలంటే షోరూమ్‌లో వెంటనే అందుబాటులో ఉన్న వేర్వేరు కలర్ ఆప్షన్లను పరిశీలించడం మంచిది. బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ.7.50 లక్షల నుంచి రూ.13.71 లక్షల వరకు ఉంటుంది.
మహీంద్రా థార్ కోసం ఎంత కాలం ఎదురుచూడాలి?
తనదైన రగ్డ్ లుక్, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ఆఫ్-రోడింగ్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న మహీంద్రా థార్ కోసం కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఢిల్లీలో థార్ వెయిటింగ్ పీరియడ్ సాధారణంగా 1 నుంచి 3 నెలల వరకు ఉండొచ్చని అంచనా. అయితే వేరియంట్, ఇంజిన్ ఆప్షన్, రంగు అలాగే డీలర్ వద్ద ఉన్న లభ్యతను బట్టి ఈ గడువు మారుతూ ఉంటుంది. 3-డోర్ల మోడల్ థార్ ఎక్స్ షోరూం ధర రూ.10.32 లక్షల నుంచి రూ.18.99 లక్షల మధ్య ఉండగా, పెద్ద సైజు 5-డోర్ల థార్ రాక్స్ ధర రూ.12.52 లక్షల నుంచి రూ.23.53 లక్షల వరకు పలుకుతోంది. మీకు నచ్చిన మోడల్ త్వరగా కావాలంటే బుకింగ్ సమయంలోనే డీలర్‌తో మాట్లాడి స్పష్టమైన తేదీని నిర్ధారించుకోవడం ఉత్తమం.
టాటా నెక్సాన్ డెలివరీ సమయం
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో టాటా నెక్సాన్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఢిల్లీలో ఈ కారు డెలివరీ కోసం సుమారు 10 రోజుల నుంచి 60 రోజుల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాల్లో అయితే 1 నెల నుంచి ఒకటిన్నర నెలల వ్యవధిలోనే కారు డెలివరీ లభిస్తోంది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ అలాగే ఎలక్ట్రిక్ మోడళ్ల లభ్యత బట్టి ఈ సమయం మారుతుంది. నెక్సాన్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 7.40 లక్షల నుంచి ప్రారంభం కాగా, సీఎన్జీ వెర్షన్ ధరలు రూ. 8.99 లక్షల నుంచి, ఎలక్ట్రిక్ మోడల్ ధరలు రూ. 12.49 లక్షల నుంచి మొదలవుతాయి.
ఏ ఎస్‌యూవీకి అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉంది?
ప్రస్తుత అంచనాల ప్రకారం బ్రేజాకు 1 నుంచి 2 నెలలు, నెక్సాన్‌కు దాదాపు 2 నెలలు, అలాగే థార్ కోసం 1 నుంచి 3 నెలల వరకు సమయం పడుతోంది. ఈ మూడింటిలో పోల్చి చూస్తే మహీంద్రా థార్ డెలివరీకి అత్యధిక సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కాలపరిమితులు పూర్తిగా అంచనాలపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. కారు కొనేముందు ఒకటి కంటే ఎక్కువ షోరూమ్‌లను సంప్రదించి, రాతపూర్వకంగా డెలివరీ తేదీని తెలుసుకోవడం ద్వారా అనవసరమైన ఆలసాన్ని నివారించవచ్చు.