Maruti Grand Vitara: నెలకు 8 వేల మందికి పైగా ఇదే కారు కొంటున్నారు.. అసలు ఏముంది ఈ కారులో ?
అసలు ఏముంది ఈ కారులో ?
Maruti Grand Vitara: ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో మైలేజీకి కేరాఫ్ అడ్రస్ అంటే మారుతి సుజుకి. అయితే కేవలం చిన్న కార్లకే కాదు.. భారీ ఎస్‌యూవీల్లో కూడా మైలేజీతో అదరగొట్టవచ్చని మారుతి నిరూపిస్తోంది. ఆ కంపెనీ నుంచి వచ్చిన గ్రాండ్ విటారా ఇప్పుడు మధ్యతరగతి, లగ్జరీ ప్రియుల ఫేవరెట్ కారుగా మారిపోయింది. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే ఏకంగా 1200 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతుండటంతో, జనం ఈ కారు కోసం క్యూ కడుతున్నారు. ప్రతి నెలా సగటున 8,300 మందికి పైగా ఈ కారును కొనుగోలు చేస్తున్నారంటే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మారుతి సుజుకి, టయోటా కంపెనీలు సంయుక్తంగా రూపొందించిన గ్రాండ్ విటారా, భారత మార్కెట్లో ఒక సంచలనం. దీని ధర రూ.10.76 లక్షల నుంచి ప్రారంభమై రూ.19.57 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కారులో ఉన్న అత్యంత ముఖ్యమైన ఫీచర్ దాని స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్. ఇది లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ట్యాంక్ కెపాసిటీని బట్టి చూస్తే, ఫుల్ ట్యాంక్‌తో సుమారు 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి మళ్ళీ సగం దూరం వెనక్కి వచ్చేయొచ్చు అన్నమాట.
హైబ్రిడ్ టెక్నాలజీ అంటే ఇందులో రెండు మోటార్లు ఉంటాయి. ఒకటి సాధారణ పెట్రోల్ ఇంజన్ కాగా, రెండోది ఎలక్ట్రిక్ మోటార్. కారు తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు లేదా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు అది కేవలం బ్యాటరీ ద్వారా నడుస్తుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, కారు నుంచి అస్సలు శబ్దం రాదు. ఇంజన్ నడుస్తున్నప్పుడే బ్యాటరీ ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంది, కాబట్టి విడిగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ స్మార్ట్ టెక్నాలజీ వల్లే విటారా మైలేజీలో తన సెగ్మెంట్లోని క్రెటా, సెల్టోస్ వంటి కార్లను మించిపోయింది.
ఫీచర్ల పరంగా కూడా ఇది ఎవరికీ తగ్గదు. కారు లోపల కూర్చుంటే ఒక లగ్జరీ ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో 360-డిగ్రీ కెమెరా ఉంది, దీనివల్ల కారు చుట్టూ ఏముందో స్క్రీన్ మీద చూస్తూ సులభంగా పార్క్ చేయవచ్చు. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి హై-ఎండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లతో మారుతి ఈ కారును పటిష్టంగా రూపొందించింది.
విక్రయాల పరంగా చూస్తే.. గత ఆరు నెలల్లో 50 వేలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే రోజుకు దాదాపు 278 మంది ఈ కారును తమ ఇంటికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ నెలలో స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌పై కంపెనీ ఏకంగా రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, మారుతికున్న విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్, అదిరిపోయే మైలేజీ కలగలిసి గ్రాండ్ విటారాను ఫ్యామిలీ ఎస్‌యూవీగా మార్చేశాయి.