Maruti Baleno: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతి బాలెనో మరింత కొత్త సొబగులతో రూపుదిద్దుకుంటోంది. 2026 మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌ను సెప్టెంబర్ 5న అధికారికంగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సరికొత్త డిజైన్, సరికొత్త ఇంజన్ టెక్నాలజీ, ఆధునిక భద్రతా ప్రమాణాలతో ఈ కారు రానుంది. కొత్త బాలెనో మోడల్‌లో ప్రధాన మార్పు దాని ఇంజన్ విభాగంలోనే కనిపిస్తుంది. ఇటీవల విడుదలైన స్విఫ్ట్‌లో ఉపయోగిస్తున్న 1.2 లీటర్ Z12 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో అమర్చనున్నారు. ఇప్పటివరకు ఉన్న 4-సిలిండర్ ఇంజన్ కంటే ఇది సైజులో చిన్నదిగా, బరువు తక్కువగా ఉంటుంది. దీనివల్ల కారు పర్ఫార్మెన్స్ పెరగడమే కాకుండా మైలేజ్ గణనీయంగా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఇంజన్‌ను స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో అనుసంధానించే అవకాశం కూడా ఉంది.

దేశంలోనే తొలిసారిగా సీఎన్‌జీ తో ఏఎంటీ గేర్‌బాక్స్

సిటీ డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు మారుతి సుజుకి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా బాలెనో సిఎన్జి వేరియంట్‌లో ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను అందించనుంది. సాధారణంగా సిఎన్జి కార్లలో కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే లభిస్తుంది. అయితే బాలెనోలో రానున్న ఈ కొత్త కాంబినేషన్ నగరాల్లో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రయాణికులకు పెద్ద ఊరట నివ్వనుంది.

అత్యంత ఆధునిక ఏడిఎఎస్ సేఫ్టీ

భద్రత విషయానికి వస్తే కొత్త బాలెనో మరింత పటిష్టంగా మారనుంది. టాప్ వేరియంట్‌లో లెవల్-1 ఏడిఎఎస్ టెక్నాలజీను అందించనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల బ్లైండ్ స్పాట్ వార్నింగ్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటి అత్యాధునిక రక్షణ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు అమర్చనున్నారు.

స్టైలిష్ లుక్.. ధర అంచనా

ఎక్స్‌టీరియర్ పరంగా కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్‌లాంప్‌లు, ఎల్‌ఈడీ లైటింగ్ ఎలిమెంట్స్, సరికొత్త అల్లాయ్ వీల్స్‌తో కారు లుక్ మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో బాలెనో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.47 లక్షల వరకు ఉంది. కొత్త ఫీచర్లు జోడించినందున ధరల్లో స్వల్ప పెంపు మాత్రమే ఉండే అవకాశం ఉంది. సరికొత్త ఇంజన్, భద్రతా ఫీచర్లు, సిఎన్జి-ఆటోమేటిక్ వేరియంట్‌తో వస్తున్న మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఈ సెగ్మెంట్‌లో సరికొత్త మైలురాయిని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది నిజంగా బెస్ట్ ఆప్షన్ కానుంది.

Tags: