Maruti Suzuki Brezza : రోడ్లపై టెస్టింగ్ షురూ.. మారుతి బ్రెజా కొత్త అవతార్ వచ్చేస్తోంది
మారుతి బ్రెజా కొత్త అవతార్ వచ్చేస్తోంది
Maruti Suzuki Brezza : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-4 మీటర్ ఎస్‌యూవీలలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజా ఇప్పుడు సరికొత్త రూపంలో ముస్తాబవుతోంది. గత కొంతకాలంగా మార్కెట్లో రారాజులా వెలుగొందుతున్న ఈ కారును మరింత అడ్వాన్స్‌డ్ గా మార్చేందుకు కంపెనీ సిద్ధమైంది. ఇటీవల దిల్లీ సమీపంలోని వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కొత్త బ్రెజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఈ స్పై షాట్స్ చూస్తుంటే, మారుతి తన పాత బ్రెజాను కేవలం మేకప్ వేయడమే కాకుండా, లోపల ఇంజన్ నుండి బయట ఫీచర్ల వరకు పెను మార్పులు చేస్తోందని స్పష్టమవుతోంది.
సాధారణంగా ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ అంటే కేవలం లుక్స్ మారుస్తారు. కానీ టెస్టింగ్ సమయంలో ఎమిషన్ టెస్టింగ్ కిట్‌ను అమర్చడం చూస్తుంటే, మారుతి బ్రెజా ఇంజన్ లో మార్పులు రాబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం బ్రెజాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా, కొత్త మోడల్‌లో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ లేదా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇంజన్ సామర్థ్యం తగ్గడం వల్ల పన్ను మినహాయింపులు లభిస్తాయి, తద్వారా కారు ప్రారంభ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది సామాన్య వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
మారుతి బ్రెజా సీఎన్‌జీ మోడల్‌ను ఇష్టపడే వారికి కూడా ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. సాధారణంగా సీఎన్‌జీ కార్లలో సిలిండర్ వల్ల బూట్ స్పేస్ లో అస్సలు చోటు ఉండదు. కానీ, కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో సీఎన్‌జీ ట్యాంకును కారు కింద భాగంలో అమర్చడం ద్వారా లోపల లగేజీ పెట్టుకోవడానికి ఎక్కువ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి, ఎక్కువ బ్యాగులు తీసుకెళ్లే వారికి ఈ అప్‌డేట్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
టెక్నాలజీ పరంగా కూడా కొత్త బ్రెజా దూసుకుపోనుంది. టెస్టింగ్ కార్ ఫ్రంట్ బంపర్ వద్ద రాడార్ యూనిట్ కనిపించడంతో, కొత్త బ్రెజాలో ఏడీఏఎస్ ఫీచర్‌ను కంపెనీ తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనివల్ల కారు ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. అంతేకాకుండా, కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, రీ-డిజైన్డ్ బంపర్లు, సరికొత్త ఫాగ్ ల్యాంప్స్, 16 అంగుళాల స్టైలిష్ అలాయ్ వీల్స్‌తో ఈ ఎస్‌యూవీకి ఒక ప్రీమియం లుక్ రాబోతోంది. వెండి రంగు స్కిడ్ ప్లేట్లు కారుకు స్పోర్టీ టచ్ ఇవ్వనున్నాయి.
ప్రస్తుతం టెస్టింగ్ చివరి దశలో ఉన్నట్లు కనిపిస్తోంది. పండుగ సీజన్ నాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ కొత్త బ్రెజా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకి ఈ కొత్త స్కెచ్ వేసింది. ఫీచర్లు పెరిగినా ధర విషయంలో మారుతి ఎప్పుడూ తన మార్కును చూపిస్తుంది కాబట్టి, ఇది తప్పకుండా మధ్యతరగతి ప్రజలకు మరోసారి ఫేవరెట్ కారుగా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.