Maruti Ertiga: కస్టమర్లకు షాక్.. మారుతి పాపులర్ ఫ్యామిలీ కారు ధర భారీగా పెంపు
భారీగా పెంపు
Maruti Ertiga: దేశీయ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన సెవెన్-సీటర్ ఫ్యామిలీ కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా ముందుంటుంది. అయితే ఈ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ చిన్నపాటి షాక్ ఇచ్చింది. కొన్ని నిర్దిష్ట వేరియంట్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరల ప్రకారం వినియోగదారులు అదనంగా రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది.
మారుతి సుజుకి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఎర్టిగా కారు అన్ని వేరియంట్లకు ఈ ధరల పెంపు వర్తించదు. కేవలం రెండు టాప్-ఎండ్ మోడళ్లపై మాత్రమే ఈ భారం పడింది. అవి జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ పెట్రోల్ మేన్యువల్ స్మార్ట్ హైబ్రిడ్ అలాగే జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ పెట్రోల్ ఆటోమేటిక్ స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్లు మాత్రమే. ఈ రెండు మోడళ్ల ధరలను రూ.10వేల మేర పెంచారు. మిగిలిన అన్ని పెట్రోల్ అలాగే సీఎన్‌జీ వేరియంట్ల ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా పాత పద్ధతిలోనే కొనసాగుతున్నాయి. కారు ప్రాథమిక ఎక్స్-షోరూమ్ ధర రూ.8.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
కుటుంబ సమేతంగా సుదూర ప్రయాణాలు చేసేవారికి ఈ కారు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణికుల రక్షణ కోసం కంపెనీ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించింది. వెనుక వైపు రూఫ్ స్పోయ్లర్ ఉండటం వల్ల కారు మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. క్యాబిన్ లోపల రెండో వరుస ప్రయాణికుల సౌకర్యం కోసం ఏసీ వెంట్లు, మొబైల్ ఛార్జింగ్ కోసం ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్‌బీ టైప్-సీ పోర్టులను అమర్చారు. మూడో వరుసలో కూర్చునేవారికి కూడా ప్రత్యేకంగా ఏసీ వెంట్లు అలాగే ఛార్జింగ్ సదుపాయం కల్పించడం వల్ల సుదీర్ఘ ప్రయాణాలలో ఎలాంటి అలసట ఉండదు.
ఈ 7-సీటర్ కారులో పవర్ఫుల్ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది సుమారు 103 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్‌తో పాటు మార్కెట్లో సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. సీఎన్‌జీ మోడ్‌లో ఈ ఇంజిన్ 89 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. మైలేజ్ విషయానికొస్తే పెట్రోల్ మేన్యువల్ వేరియంట్ లీటరుకు సుమారు 20.51 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ 20.30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక సీఎన్‌జీ మోడల్ అయితే కిలోకు 26.11 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది.