Maruti Suzuki : మారుతి సుజుకి అదిరిపోయే ప్లాన్.. కొత్త లుక్‌లో రాబోతున్న బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా

కొత్త లుక్‌లో రాబోతున్న బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా

Update: 2026-06-09 08:12 GMT

Maruti Suzuki : భారతదేశపు నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ ఎస్‌యూవీ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 18 మోడల్స్ కార్లు అందుబాటులో ఉండగా, 2030 నాటికి ఈ సంఖ్యను ఏకంగా 28 మోడళ్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న తన మూడు పాపులర్ ఎస్‌యూవీలు బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారాలను సరికొత్త అప్‌డేట్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

దీపావళి కానుకగా కొత్త బ్రెజ్జా, గ్రాండ్ విటారా

ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం.. సరికొత్త మారుతి బ్రెజ్జా, గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు 2026 దీపావళి పండుగ సీజన్ నాటికి భారత మార్కెట్లో సందడి చేసే అవకాశం ఉంది. ఇక యంగ్ జనరేషన్‌ను బాగా ఆకట్టుకున్న మారుతి ఫ్రాంక్స్ నెక్స్ట్ జనరేషన్ మోడల్ 2027 లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లలో కేవలం లుక్స్ మాత్రమే కాకుండా, సేఫ్టీ, పవర్‌ట్రెయిన్ పరంగా కూడా మారుతి సుజుకి విప్లవాత్మక మార్పులు చేయబోతోంది.

కొత్త లుక్,క్రేజీ ఫీచర్లతో బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్

2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్ డిజైన్ పరంగా కస్టమర్లకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఇందులో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త డిజైన్ బంపర్, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ ఫాగ్ ల్యాంప్ సెటప్‌ను అందించబోతున్నారు. కారు లోపల ప్రీమియం లుక్ కోసం పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, కొత్త సీట్ ఫ్యాబ్రిక్‌ను జోడించనున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఇందులో ఫ్రాంక్స్‌లో ఉండే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, సీఎన్‌జీ ప్రియుల కోసం బూట్ స్పేస్ తగ్గకుండా ఉండేలా అండర్ బాడీ సీఎన్‌జీ ట్యాంక్ ఆప్షన్‌ను తీసుకురావడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

లెవెల్-2 ADAS ఫీచర్‌తో గ్రాండ్ విటారా

మారుతి గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్ మోడల్ బాహ్య డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, కారును మునుపటికంటే ఎక్కువ ప్రీమియం లుక్‌తో డిజైన్ చేస్తున్నారు. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ & రియర్ బంపర్స్, సరికొత్త ఎల్‌ఈడీ లైటింగ్ దీని సొంతం కానున్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రయాణికుల భద్రత కోసం అత్యంత అధునాతనమైన లెవెల్-2 ADAS సేఫ్టీ ఫీచర్‌ను జోడించనున్నారు. అయితే దీని ఇంజిన్ మరియు మెకానికల్ సెటప్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

సొంత హైబ్రిడ్ ఇంజిన్‌తో రానున్న ఫ్రాంక్స్

2027 లో రాబోయే మారుతి ఫ్రాంక్స్ అప్‌డేట్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు దాని ఇంజిన్. మారుతి సుజుకి కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసిన సరికొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్న మొదటి కారు ఇదే కావడం విశేషం. ఈ హైబ్రిడ్ సిస్టమ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌పై ఆధారపడి పనిచేస్తుంది, దీనివల్ల కారు మైలేజ్ ఊహించని రేంజ్‌లో పెరుగుతుంది. పెట్రోల్ ఖర్చులు భారీగా తగ్గుతాయి. భవిష్యత్తులో ఇదే హైబ్రిడ్ టెక్నాలజీని స్విఫ్ట్, బాలెనో, బ్రెజ్జా కార్లలో కూడా వాడనున్నారు. కొత్త ఫ్రాంక్స్‌లో లెవెల్-2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు, సరికొత్త మోడ్రన్ ఎక్స్‌టీరియర్ లుక్‌ను అందించనున్నారు. మొత్తానికి మారుతి సుజుకి ఈ అప్‌డేట్లతో ఇండియన్ మార్కెట్లో తన నంబర్ వన్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News