Maruti Suzuki Victoris : విక్టోరిస్ విశ్వరూపం.. సెల్టోస్, హైరైడర్ గల్లంతు.. క్రెటా సింహాసనానికి ముప్పు తప్పదా?

సెల్టోస్, హైరైడర్ గల్లంతు.. క్రెటా సింహాసనానికి ముప్పు తప్పదా?

Update: 2026-05-14 13:19 GMT

Maruti Suzuki Victoris : భారతీయ కార్ల మార్కెట్ దిగ్గజం మారుతి సుజుకి మరోసారి తన సత్తా చాటింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ విక్టోరిస్ ఇప్పుడు కంపెనీ పాలిట వరంగా మారింది. కేవలం కొద్ది నెలల్లోనే అమ్మకాల్లో దూసుకుపోతూ కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి దిగ్గజ కార్లను వెనక్కి నెట్టేసింది. ఏప్రిల్ 2026 నాటికి విక్టోరిస్ దేశంలోనే మూడవ అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీగా అవతరించింది. హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కోర్పియోలకు గట్టి పోటీ ఇస్తూ టాప్-3 స్థానంలో నిలబడటం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.

విక్టోరిస్ విజయానికి ప్రధాన కారణం దాని ధర మరియు భద్రత. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.50 లక్షలుగా ఉంది. సామాన్యులకు అందుబాటులో ఉండటమే కాకుండా, ఈ కారు సేఫ్టీలోనూ అదరగొట్టింది. గ్లోబల్ ఎన్‌క్యాప్, భారత్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో విక్టోరిస్ ఏకంగా 5-స్టార్ రేటింగ్ సాధించింది. మారుతి కార్లు సేఫ్టీలో తక్కువ అనే విమర్శలకు ఈ కారు చెక్ పెట్టిందని చెప్పవచ్చు.

ఈ కారులో గ్రాండ్ విటారా తరహాలోనే పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్ అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 103 Hp పవర్‌ను ఇస్తుండగా, ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. విక్టోరిస్‌లో ఆల్-గ్రిప్ సెలెక్ట్ సిస్టమ్ కూడా ఉంది. దీనివల్ల మంచు, స్పోర్ట్స్, లాక్ వంటి డ్రైవింగ్ మోడ్స్ ద్వారా ఎలాంటి రోడ్డుపైనైనా సునాయాసంగా ప్రయాణించవచ్చు.

మైలేజీ విషయంలో విక్టోరిస్ సెగ్మెంట్‌లోనే టాప్‌గా నిలుస్తోంది. స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్ లీటరుకు ఏకంగా 28.65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అలాగే సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 27.02 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మారుతి చరిత్రలోనే విక్టోరిస్ కారులోనే మొదటిసారి అండర్ బాడీ సీఎన్‌జీ ట్యాంక్‎ను ప్రవేశపెట్టారు. దీనివల్ల సీఎన్‌జీ సిలిండర్ ఉన్నప్పటికీ బూట్ స్పేస్ లో సామాన్లు పెట్టుకోవడానికి కావాల్సినంత స్థలం లభిస్తుంది.

ఏప్రిల్ నెల సేల్స్ డేటాను పరిశీలిస్తే.. 15,291 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ క్రెటా మొదటి స్థానంలో ఉండగా, 14,719 యూనిట్లతో మహీంద్రా స్కార్పియో రెండవ స్థానంలో ఉంది. విక్టోరిస్ తన అమ్మకాలను పెంచుకుంటూ కియా సెల్టోస్, తన సొంత మోడల్ అయిన గ్రాండ్ విటారాను అధిగమించి మూడవ స్థానానికి చేరడం మారుతి సుజుకికి పెద్ద బూస్ట్‌గా మారింది. ఫీచర్లు, సేఫ్టీ, మైలేజీ మూడింటి కలయికతో వస్తున్న ఈ కారు రాబోయే రోజుల్లో క్రెటా స్థానాన్ని దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags:    

Similar News