Maruti Suzuki : మార్కెట్లోకి మారుతి సుజుకి 3 కొత్త కార్లు.. బ్రెజ్జా, బాలెనోతో పాటు సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్యామిలీ కార్
సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్యామిలీ కార్
Maruti Suzuki : భారతదేశంలో నంబర్-1 కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి రాబోయే రోజుల్లో మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకోవడానికి గట్టి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా కంపెనీ తన మూడు మోస్ట్ అవేటెడ్ మోడల్స్ అయిన బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్, బలెనో ఫేస్‌లిఫ్ట్, సరికొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ కార్ల టెస్టింగ్‌ను విపరీతంగా పెంచేసింది. రోడ్లపై టెస్టింగ్ జరుగుతున్న సమయంలో వీటికి సంబంధించిన స్పై చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో లీకై హల్‌చల్ చేస్తున్నాయి. వీటిలో 2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కారు జూలై 23వ తేదీనే అఫీషియల్‌గా లాంచ్ కాబోతుండగా, మిగిలిన రెండు కార్లు ఈ ఏడాది చివరికల్లా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
సరికొత్త ఇంజన్‌తో వస్తున్న మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్
కొత్తగా రాబోతున్న 2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో లుక్ పరంగా చిన్నపాటి మార్పులు చేసినప్పటికీ, ఇంజన్ పరంగా ఒక భారీ అప్‌డేట్ ఇవ్వనున్నారు. మారుతి ఫ్రాంక్స్ కార్లో విజయవంతమైన 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను ఇప్పుడు కొత్త బ్రెజ్జాలో కూడా అందించబోతున్నారు. ఇది 100 బిహెచ్‌పి పవర్‌ను, 148 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానుంది. అంతేకాకుండా, దీని సీఎన్‌జీ వేరియంట్‌లో సిలిండర్ కనిపించకుండా కారు కింద భాగంలో అమర్చే సరికొత్త టెక్నాలజీని వాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బేస్ వేరియంట్లలో మాత్రం పాత 1.5 లీటర్ ఇంజన్ కొనసాగే అవకాశం ఉంది.
బ్రెజ్జా కార్లో ఫస్ట్ టైమ్ లగ్జరీ ఫీచర్లు
ఫీచర్ల పరంగా చూస్తే ఈ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలో సెక్యూరిటీ కోసం అడ్వాన్స్‌డ్ లెవెల్-2 అడాస్ సేఫ్టీ ఫీచర్‌ను ఇవ్వబోతున్నట్లు సమాచారం. దీనితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, యాంబియంట్ లైటింగ్ లాంటి లగ్జరీ ఫీచర్లు కూడా యాడ్ కానున్నాయి. బయటి వైపు కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఈ కారుకు సరికొత్త స్పోర్టీ లుక్‌ను ఇవ్వనున్నాయి.
కొత్త లుక్‌లో మెరవనున్న మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్
లీకైన ఫోటోల ప్రకారం.. 2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్ కారు ముందు భాగంలో సరికొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్ ఉండబోతున్నాయి. అయితే ఇందులో ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, బూమరాంగ్ షేప్ డీఆర్‌ఎల్‌లు పాత మోడల్ లాగే కొనసాగనున్నాయి. కారు లోపలి భాగంలో మరింత క్వాలిటీ మెటీరియల్‌తో పాటు సరికొత్త కేబిన్ థీమ్‌ను కస్టమర్ల కోసం డిజైన్ చేస్తున్నారు. ఇంజన్ విషయానికి వస్తే ఇందులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. పాత 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (90 BHP పవర్, 113 Nm టార్క్) తోనే ఇది రానుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ (AMT), సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది.
మారుతి మొదటి ఎలక్ట్రిక్ ఫ్యామిలీ కార్ (YMC EV MPV)
మారుతి సుజుకి కంపెనీ YMC అనే కోడ్‌నేమ్‌తో ఒక సరికొత్త త్రీ-రో ఎలక్ట్రిక్ ఫ్యామిలీ కారును తయారు చేస్తోంది. ఈ కారును మారుతి త్వరలో లాంచ్ చేయబోయే ఇ-విటారా ప్లాట్‌ఫారమ్, స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్‌పైనే నిర్మిస్తున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే 49kWh, 61kWh అనే రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో లభించనుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 543 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా. ఎర్టిగా, ఎక్స్‌ఎల్6, ఇన్విక్టో కార్ల తర్వాత మారుతి లైనప్‌లో రాబోతున్న నాలుగో ఫ్యామిలీ ఎంపీవీ కార్ ఇదే కావడం విశేషం.