Mercedes Benz: ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంచ్ భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి తమ కొత్త జిఎల్‌సి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అధికారికంగా విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరను రూ. 78.5 లక్షలుగా నిర్ణయించారు. మన దేశంలోనే స్వయంగా అసెంబుల్ చేయనున్న ఈ మోడల్, కంపెనీ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లైనప్‌లోనే అత్యంత అందుబాటు ధరలో లభించే వాహనంగా నిలుస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ మోడల్, ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 711 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ ప్రయాణాన్ని అందిస్తుందని కంపెనీ స్పష్టం చేస్తోంది. ఈ కారుకు మార్కెట్లో ఇప్పటికే 1,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు లభించాయి.

914 ఎల్ఈడీ ప్యానెల్ తో అల్ట్రా స్పోర్టీ డిజైన్

జిఎల్‌సి ఎలక్ట్రిక్ మోడల్ ముందు భాగం డిజైన్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. దీని ముందు గ్రిల్‌లో ఏకంగా 914 ఎల్ఈడీ పిక్సెల్స్ అమర్చారు. కారు స్టార్ట్ లేదా ఆఫ్ అయినప్పుడు, అలానే పార్కింగ్ సమయంలో ఇవి ప్రత్యేక లైటింగ్ ప్యాటర్న్లను ప్రదర్శిస్తాయి. ప్రసిద్ధ త్రీ-పాయింటెడ్ స్టార్ ఆకారపు ఎల్ఈడీ డిఆర్ఎల్స్ వాహనానికి ప్రత్యేక మెరుగులు దిద్దాయి. భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన జిఎల్‌సి 400 మోడల్‌లో ఎఎమ్‌జి స్టైలింగ్ ప్యాక్, 20-అంగుళాల భారీ అల్లాయ్ వీల్స్, రేసింగ్ ప్రేరేపిత బంపర్లు ప్రామాణికంగా లభిస్తాయి. సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ జిఎల్‌సి వెహికల్ తో పోలిస్తే ఇది 140 మిల్లీమీటర్లు ఎక్కువ పొడవు కలిగి ఉంది.

39.1 అంగుళాల డిజిటల్ హైపర్‌స్క్రీన్ సౌకర్యం

ఈ లగ్జరీ కారు ఇంటీరియర్ డ్యాష్‌బోర్డ్ పై ఒక చివర నుంచి మరో చివరి వరకు విస్తరించిన 39.1-అంగుళాల భారీ హైపర్‌స్క్రీన్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. భౌతిక బటన్లను తగ్గించి డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరిచారు. ప్రీమియం బ్లాక్ ఓపెన్-పోర్ కలప, మెటాలిక్ ఏసీ వెంట్లు, 15 స్పీకర్ల సామర్థ్యం గల 3D బుర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ క్యాబిన్‌కు అద్భుతమైన వైభవాన్ని ఇస్తాయి. కేబిన్ కోసం బ్లాక్, బీచ్ బ్రౌన్, ఐవరీ బైజ్ రంగుల ఎంపికలు కల్పించారు.

ఆధునిక రక్షణ సదుపాయాలు, హైటెక్ ఫీచర్లు

సౌకర్యాల విషయానికి వస్తే పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, మూడ్ ఏంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ లభిస్తాయి. ముందు సీట్లకు మసాజ్, హీటింగ్ ఆప్షన్లు ఇచ్చారు. వాహనంలో 570 లీటర్ల వెనుక బూట్ స్పేస్ తో పాటు ముందు భాగంలో 128 లీటర్ల ఫ్రంక్ లభిస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం 8 కెమెరాలు, 5 రాడార్లతో పనిచేసే లెవెల్-2 అడాస్ (ADAS) సాంకేతికత, 360-డిగ్రీల కెమెరా, ఆటో పార్కింగ్ అసిస్ట్, 9 ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు.

490 గుర్రాల పవర్.. చిటికెలో 100 కిలోమీటర్ల వేగం

భారత్‌కు వచ్చిన జిఎల్‌సి 400 4మేటిక్ మోడల్‌లో 94kWh భారీ బ్యాటరీ ప్యాక్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు. ఇవి రెండూ కలిసి 490 హార్స్ పవర్ శక్తిని, 800Nm అద్భుతమైన టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ కారు కేవలం 4.3 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఛార్జింగ్ కోసం 22kW ఏసీ ఛార్జర్ ఇస్తుండగా, 330kW డిసి ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 300 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. పండుగ సీజన్ నాటికి ఈ లగ్జరీ వాహనాల డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

Tags: