Mercedes EQS : మెర్సిడెస్ నుంచి ఎలక్ట్రిక్ సునామీ.. ఒకసారి ఛార్జ్ చేస్తే 926 కి.మీ రేంజ్.. EQS ఫేస్‌లిఫ్ట్ లాంచ్
ఒకసారి ఛార్జ్ చేస్తే 926 కి.మీ రేంజ్.. EQS ఫేస్‌లిఫ్ట్ లాంచ్
Mercedes EQS : లగ్జరీ కార్ల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న మెర్సిడెస్ బెంజ్, తన సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్ EQS ఫేస్‌లిఫ్ట్ ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. లగ్జరీ, టెక్నాలజీ కలబోతగా వచ్చిన ఈ కారు ప్రస్తుతం కంపెనీ నాన్-మేబ్యాక్ లైనప్‌లో అత్యంత ఖరీదైన, ప్రీమియం మోడల్‌గా నిలిచింది. డిజైన్ నుంచి పవర్‌ట్రైన్ వరకు ప్రతి విభాగంలోనూ ఊహించని మార్పులతో వచ్చిన ఈ కారు, 2027 నాటికి భారత రోడ్లపై సందడి చేసే అవకాశం ఉంది. కొత్త మెర్సిడెస్ EQS ఫేస్‌లిఫ్ట్ తన పాత కూపే-స్టైల్ ఆకారాన్ని కొనసాగిస్తూనే, లుక్ పరంగా పూర్తిగా కొత్తగా మారింది. గాలిని చీల్చుకుంటూ వెళ్లేలా దీని ఏరోడైనమిక్స్ (0.20 Cd) డిజైన్ చేశారు. ముందు భాగంలో కొత్త గ్రిల్, వెలిగిపోయే మర్సిడెస్ లోగోలు ప్రత్యేక ఆకర్షణ. దీని డిజిటల్ లైట్ హెడ్ ల్యాంప్స్ చీకటిలో 600 మీటర్ల దూరం వరకు వెలుగును ప్రసరిస్తాయి, ఇది రాత్రి వేళ ప్రయాణాన్ని అత్యంత సురక్షితం చేస్తుంది. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, కొత్త డిఫ్యూజర్ డిజైన్ కారుకు ప్రీమియం లుక్‌నిచ్చాయి.
హైటెక్ ఇంటీరియర్ - హైపర్‌స్క్రీన్ మ్యాజిక్
కారు లోపలికి వెళ్తే విలాసవంతమైన లోకంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. డ్రైవర్ కోసం స్టీర్-బై-వైర్ స్టీరింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు, దీనివల్ల డిజిటల్ డిస్ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ప్రసిద్ధ హైపర్‌స్క్రీన్ సెటప్‌ను కొనసాగించారు. అంటే డాష్‌బోర్డ్ మొత్తం ఒకే గ్లాస్ కింద మూడు పెద్ద స్క్రీన్లను కలిగి ఉంటుంది. ఇది కంపెనీ సరికొత్త MB.OS సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. AI ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ మీ చిన్న సూచనలకే స్పందించి కారును కంట్రోల్ చేస్తుంది.
వెనుక సీటు ప్రయాణికులకు రాజభోగం
సాధారణంగా లగ్జరీ కార్లలో వెనుక కూర్చునే వారికి ప్రాధాన్యత ఎక్కువ. అందుకే EQSలో వెనుక కూర్చునే వారి కోసం 13.1-అంగుళాల రెండు ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు ఇచ్చారు. అంతేకాకుండా, చలికాలంలో ఇబ్బంది కలగకుండా హీటెడ్ సీట్ బెల్టులు, హెచ్ఈపీఏ ఎయిర్ ఫిల్టర్లు కారులోని గాలిని ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుతాయి. పార్కింగ్ కోసం కష్టపడక్కర్లేకుండా డయాగనల్ పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
రేంజ్ లో రారాజు - 926 కి.మీ మైలేజ్
బ్యాటరీ, పర్ఫార్మెన్స్ విషయంలో ఈ కారును మరేదీ కొట్టలేదు. ఇందులోని EQS 450+ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 926 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 122 kWh వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచారు. ఈ కారు 585 bhp వరకు పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది, అంటే స్పోర్ట్స్ కార్ల కంటే వేగంగా దూసుకుపోతుంది. 350 kW డిసి ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 320 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా బ్యాటరీ నిండుతుంది. దీని ఎయిర్ సస్పన్షన్ సిస్టమ్ క్లౌడ్ డేటాను ఉపయోగించి రోడ్డుపై గుంతలను బట్టి కారు ఎత్తును స్వయంగా సర్దుబాటు చేసుకుంటుంది.