MG Majestor : రూ.41 వేలకే లగ్జరీకి కేరాఫ్ అడ్రస్..ఎంజీ మెజెస్టర్ అదిరిపోయే లుక్ చూశారా?
ఎంజీ మెజెస్టర్ అదిరిపోయే లుక్ చూశారా?
MG Majestor : ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. తాజాగా ఎంజీ మోటార్స్ తన అత్యంత విలాసవంతమైన, భారీ 7-సీటర్ ఎస్‌యూవీ మెజెస్టర్‌ను భారత మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. కేవలం డిజైన్ మాత్రమే కాదు, ఫీచర్లు, పరిమాణంలో కూడా ఇది తన విభాగంలోనే మొనగాడిగా నిలవనుంది. టయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేలా ఎంజీ ఈ కారును తీర్చిదిద్దింది. ఎంజీ మోటార్స్ ఈ మెగా ఎస్‌యూవీ కోసం అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. కేవలం రూ.41,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ కారు అసలు ధరలను ఏప్రిల్ 2026లో వెల్లడించనున్నారు. మే నెల నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. మార్కెట్ అంచనాల ప్రకారం.. దీని ధర రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది తన విభాగంలోనే అత్యంత పొడవైన, వెడల్పైన, ఎత్తైన ఎస్‌యూవీగా రికార్డు సృష్టించనుంది.
మెజెస్టర్ బయటి నుంచి చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తుంది. ముందు భాగంలో మ్యాట్రిక్స్ స్టైల్ గ్రిల్, ఆకట్టుకునే ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్ ఉన్నాయి. మజిల్ లుక్ కోసం భారీ అలాయ్ వీల్స్, విశాలమైన బోనెట్, బ్లాక్-అవుట్ పిల్లర్లు, వెనుక వైపు డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ అమర్చారు. ఇది 4 విభిన్న రంగుల్లో, రెండు రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది.
కారు లోపలికి వెళ్తే ఒక లగ్జరీ హోటల్ గదిలా అనిపిస్తుంది. ఇందులో వెంటిలేషన్ సౌకర్యంతో పాటు మల్టీ-మోడ్ మసాజింగ్ సీట్లు ఉన్నాయి. డ్రైవర్ సీటును 12 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 12.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 12-స్పీకర్ల జేబీఎల్ (JBL) ఆడియో సిస్టమ్ అద్భుతమైన సౌండ్ అనుభూతిని ఇస్తాయి. 64 రంగుల ఆంబియంట్ లైటింగ్, ఆకాశాన్ని చూసేందుకు వీలుగా భారీ పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.
మెజెస్టర్ లో 2.0 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ ఉంది, ఇది 215 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీలో అడ్వాన్స్‌డ్ 4x4 సిస్టమ్ ఉంది. ఇందులో నార్మల్, సాండ్, రాక్, మడ్, స్నో వంటి 10 రకాల ఆఫ్-రోడ్ మోడ్స్ ఇచ్చారు. దీనికి 810 మిమీ వాటర్ వేడింగ్ కెపాసిటీ (నీటిలో ప్రయాణించే సామర్థ్యం) ఉండటం విశేషం. అంటే ఎంతటి భారీ వర్షాలనైనా, గుంతలనైనా ఇది సునాయాసంగా దాటేస్తుంది.
సేఫ్టీ విషయంలో ఎంజీ ఎప్పుడూ ముందే ఉంటుంది. మెజెస్టర్ లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 360-డిగ్రీ హెచ్‌డీ కెమెరా సెటప్ వల్ల కారు చుట్టుపక్కల ప్రతి అంగుళాన్ని స్క్రీన్‌పై చూడవచ్చు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ గా వస్తున్నాయి. హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ ను సులభతరం చేస్తాయి.