MG Majestor : 400 టన్నుల బరువు.. 300 అడుగుల దూరం.. భారీ రైలును లాగేసిన ఎంజీ మెజెస్టర్

భారీ రైలును లాగేసిన ఎంజీ మెజెస్టర్

Update: 2026-04-10 12:04 GMT

MG Majestor : భారత ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టకముందే ఎంజీ మోటార్స్ సృష్టించిన సరికొత్త ఎస్‌యూవీ మెజెస్టర్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. కేవలం రోడ్ల మీద వేగంగా వెళ్లడమే కాదు, భారీ రైలును లాగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. జమ్మూ కాశ్మీర్ గడ్డపై జరిగిన ఈ అద్భుత ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా కార్లు అంటే ప్రయాణికులను మోసుకెళ్తాయి. కానీ ఎంజీ మెజెస్టర్ మాత్రం ఏకంగా ఒక భారీ రైలునే లాగేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని కాకాపోరా, అవంతీపోరా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఫీట్ నిర్వహించారు. WAG-9HC అనే భారీ లోకోమోటివ్ ఇంజిన్‌తో పాటు ప్యాసింజర్, గార్డ్ కోచ్‌లు కలిపి మొత్తం 406.4 టన్నుల బరువున్న రైలును ఈ ఎస్‌యూవీ 300 అడుగుల మేర విజయవంతంగా లాగింది. గిన్నిస్ బుక్ ప్రమాణాల ప్రకారం 400 టన్నుల బరువును 100 అడుగుల దూరం లాగితేనే రికార్డు ఇస్తారు. కానీ మెజెస్టర్ ఆ పరిమితులను ఎప్పుడో దాటేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.

ఈ రికార్డులో అత్యంత విశేషమైన విషయం ఏంటంటే.. ఇందుకోసం ఉపయోగించిన ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీలో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయలేదు. షోరూమ్ నుంచి వచ్చే సాధారణ ఇంజిన్, డ్రైవ్‌ట్రెయిన్, టైర్లతోనే ఈ ఫీట్ సాధించారు. కేవలం పట్టాల మీద కారు సరిగ్గా వెళ్లడం కోసం అదనంగా రైల్ వీల్స్ మాత్రమే అమర్చారు. కారు ఇంజిన్ శక్తిని, ట్రాక్షన్ మేనేజ్‌మెంట్‌ను ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ ప్రయోగం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం అని కంపెనీ తెలిపింది.

https://www.instagram.com/reels/DW8OQ-WASDc/

మెజెస్టర్ ఇంతటి భారీ బరువును లాగడానికి కారణం దాని గుండెకాయ లాంటి 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్. ఇది 212.5 bhp పవర్, 478.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి తోడు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, అడ్వాన్స్‌డ్ 4WD సిస్టమ్ తోడయ్యాయి. ఈ సెగ్మెంట్లో మొదటిసారిగా ఇందులో ఫ్రంట్, రియర్, సెంటర్ అనే మూడు డిఫరెన్షియల్ లాక్స్‌ను అందించారు. దీనివల్ల కారుకు అద్భుతమైన గ్రిప్, పవర్ డెలివరీ లభిస్తుంది.

జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ.. "మెజెస్టర్ ఇంజనీరింగ్ సామర్థ్యానికి ఈ రికార్డు ఒక నిదర్శనం. కఠినమైన పరిస్థితుల్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా మేము దీనిని రూపొందించాము" అని పేర్కొన్నారు. ఏప్రిల్ 20న అధికారికంగా లాంచ్ కానున్న ఈ ఎస్‌యూవీ, ఇప్పటికే ఈ గిన్నిస్ రికార్డుతో టయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమని సంకేతాలు పంపింది. ఆఫ్‌రోడింగ్ ప్రియులకు మెజెస్టర్ ఒక సరికొత్త అనుభూతిని అందించబోతోంది.

Tags:    

Similar News