MG Majestor : ఎంజీ మేజెస్టర్ టాప్ వేరియంట్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లతో ఫార్చ్యూనర్‌కు చుక్కలే
అదిరిపోయే ఫీచర్లతో ఫార్చ్యూనర్‌కు చుక్కలే
MG Majestor : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో లగ్జరీ ఎస్‌యూవీల సామ్రాజ్యాన్ని శాసిస్తున్న టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన సరికొత్త మోన్‌స్టర్ కారు ఎంజీ మేజెస్టర్ టాప్ వేరియంట్ ధరలను అధికారికంగా విడుదల చేసింది. మార్కెట్లోకి అడుగుపెడుతూనే ఆఫ్‌రోడింగ్ ప్రియులను ఆకట్టుకునేలా కంపెనీ అదిరిపోయే ప్రైస్ ట్యాగ్‌ను సెట్ చేసింది. ఇందులో ఎంజీ మేజెస్టర్ 4×2 ఆటోమేటిక్ టాప్ వేరియంట్ ప్రారంభ ధరను రూ.40.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ప్రకటించగా.. అత్యంత పవర్‌ఫుల్ మోడల్ అయిన 4×4 ఆటోమేటిక్ టాప్ వేరియంట్ ధరను రూ.44.99 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. మిగిలిన బేస్, మిడ్ వేరియంట్ల ధరలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.
ఈ రాయల్ ఎస్‌యూవీ కోసం దేశవ్యాప్తంగా ప్రీ-బుకింగ్స్ అప్పుడే జోరుగా సాగుతున్నాయి. కస్టమర్లు ఆన్‌లైన్ ద్వారా లేదా తమకు దగ్గరలోని ఎంజీ డీలర్‌షిప్‌ను సందర్శించి కేవలం రూ.41,000 టోకెన్ అమౌంట్‌తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు.భారీ పరిమాణం, అల్ట్రా లగ్జరీ ఇంటీరియర్‌తో వస్తున్న ఈ కారు రోడ్డుపై వెళుతుంటే రాజసం ఉట్టిపడటం ఖాయమని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఎంజీ మేజెస్టర్ ఇంజన్ పవర్, పెర్ఫార్మెన్స్ పరంగా ఒక రేంజ్ లో ఉంటుంది. ఇందులో అత్యంత శక్తివంతమైన 2.0 లీటర్ల ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది ఏకంగా 215 హార్స్‌పవర్, 478.5 ఎన్ఎమ్ లాంటి భారీ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి తోడు 8-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఘాట్ రోడ్లు, బురద, ఇసుక వంటి ఎలాంటి కఠినమైన దారుల్లోనైనా దూసుకెళ్లడానికి ఇందులో లో-రేంజ్ గేర్‌తో కూడిన ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) సెటప్ అందించారు. ఆఫ్‌రోడింగ్ లవర్స్ కోసం ఇందులో మూడు లాకింగ్ డిఫరెన్షియల్స్‌తో పాటు స్నో, రాక్, సాండ్, మడ్, నార్మల్ అనే 5 విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఇచ్చారు.
కారు లోపల అడుగుపెడితే లగ్జరీ కార్లకే మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ హంగులు ఉన్నాయి. సిల్వర్ యాక్సెంట్స్‌తో కూడిన ప్రీమియం బ్లాక్ ఇంటీరియర్ థీమ్ కారుకు రాయల్ లుక్‌ను ఇస్తుంది. డాష్‌బోర్డ్‌పై రెండు భారీ 12.3 ఇంచుల డిస్‌ప్లేలను అమర్చారు. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం పనిచేస్తుంది. ఈ ఎస్‌యూవీ 6-సీటర్, 7-సీటర్ లేఅవుట్లలో లభించనుంది. ఇందులో ప్రీమియం లెదరెట్ అప్హోల్‌స్టరీని స్టాండర్డ్‌గా ఇచ్చారు.
ఇక దీని టాప్-ఎండ్ సావీ ట్రిమ్‌లో ఆకాశాన్ని తలపించేలా పనోరమిక్ సన్ రూఫ్, జేబీఎల్ బ్రాండ్‌కు చెందిన 12 స్పీకర్ల స్టూడియో ఆడియో సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా డ్రైవర్ కోసం మెమరీ ఫంక్షన్‌తో కూడిన 12-వే పవర్-అడ్జస్టబుల్ సీటు, ప్యాసింజర్ కోసం 8-వే అడ్జస్టబుల్ సీటును ఇచ్చారు. లాంగ్ జర్నీలలో అలసట తెలియకుండా ఉండటానికి ముందు రెండు సీట్లకు కూలింగ్, మసాజ్ ఫీచర్లను కూడా అందించడం విశేషం. రాత్రి పూట కేబిన్ క్లాస్‌గా కనిపించడం కోసం 64 కలర్స్ యాంబియంట్ లైటింగ్ కూడా ఉంది.
ఎంజీ మేజెస్టర్ డిజైన్ పరంగా చాలా అగ్రెసివ్‌గా, బాక్సీ షేప్‌లో ఉంటుంది. దీని భారీ ఫ్రంట్ గ్రిల్, ఐబ్రో స్టైల్ స్లీక్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, నిలువుగా ఉండే ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు దీనికి ఒక సింహం లాంటి లుక్‌ను ఇస్తాయి. కారు బంపర్ కింద సిల్వర్ స్కిడ్ ప్లేట్, చుట్టూ వీల్ ఆర్చ్ క్లాడింగ్‌ను ఇచ్చారు. ఈ కారుకు 19 ఇంచుల భారీ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కారు ఎక్కడానికి వీలుగా సైడ్ స్టెప్స్ అందించారు. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ కారు స్పోర్టీ లుక్‌ను మరింత పెంచుతాయి.
ఈ రాక్షస ఎస్‌యూవీ సైజ్, కొలతలు చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగరాల్సిందే. దీని పొడవు 5,046 మిమీ, వెడల్పు 2,016 మిమీ, ఎత్తు 1,870 మిమీగా ఉంది. అలాగే దీని వీల్‌బేస్ ఏకంగా 2,950 మిమీ. ఈ భారీ సైజ్ కారణంగా కారు లోపల లగేజ్ పెట్టడానికి, ఫ్రీగా కూర్చోవడానికి అద్భుతమైన స్పేస్ దొరుకుతుంది. మన దేశంలోని గుంతల రోడ్లను అసలు లెక్కచేయని విధంగా దీనికి 219 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. అంతేకాదు, ఏకంగా 810 మిమీ లోతు గల నీటిలో కూడా ఈ కారు ఇంజన్ ఆగిపోకుండా, బోటులాగా చాలా సులభంగా దాటగలదు. ఈ అల్ట్రా ఫీచర్ల వల్ల లగ్జరీ ఆఫ్‌రోడింగ్ మార్కెట్లో ఎంజీ మేజెస్టర్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.