MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీ కొనేవారికి షాక్.. రూ.60,000 వరకు పెరిగిన ధరలు
రూ.60,000 వరకు పెరిగిన ధరలు
MG Windsor EV : భారత ఈవీ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంజీ విండ్సర్ ఈవీ కొనుగోలుదారులకు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కీలక వార్త చెప్పింది. కంపెనీ విండ్సర్ ఈవీకి చెందిన అన్ని వేరియంట్ల ధరలలో మార్పులు చేసింది. ముడి పదార్థాల ఖర్చులు, నిర్వహణ ఖర్చులు పెరగడంతో సాధారణ (స్టాండర్డ్) వేరియంట్ల ధరలు దాదాపు రూ. 39,900 నుంచి రూ. 60,000 వరకు ప్రియమయ్యాయి. అయితే బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ (BaaS) మోడల్‌ను ఎంచుకునే వాహనదారులకు కొన్ని వేరియంట్లలో ధర తగ్గడంతో కొంత ఊరట లభించింది.
స్టాండర్డ్ వేరియంట్లు ఎంత పెరిగాయి?
పూర్తిగా బ్యాటరీతో కలిపి వాహనాన్ని కొనుగోలు చేసే స్టాండర్డ్ మోడళ్లలో ఎంట్రీ లెవెల్ ఎక్సైట్ వేరియంట్‌పై అత్యధికంగా రూ.60,000 పెంపు విధించారు. దీంతో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.70 లక్షలకు చేరింది. అలాగే ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ మోడళ్లపై రూ.46,900 చొప్పున ధర పెరిగింది. పెద్ద బ్యాటరీ కలిగిన ప్రొ మోడళ్లలో ఎక్స్‌క్లూజివ్ ప్రొ రూ. 51,900, టాప్ మోడల్ ఎసెన్స్ ప్రొ రూ. 39,900 వరకు ప్రియమయ్యాయి.
బాస్ మోడల్ ధరలలో ఊరట
కార్, బ్యాటరీ వ్యయాన్ని విడివిడిగా చెల్లించే బాస్ విధానం ఎంచుకునే వారికి కొన్ని మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలో సడలింపు లభించింది. ఎక్స్‌క్లూజివ్ బాస్, ఎసెన్స్ బాస్ వేరియంట్ల ప్రారంభ ధరలను కంపెనీ రూ. 13,100 చొప్పున తగ్గించింది. అయితే, పెద్ద బ్యాటరీ వేరియంట్లు అయిన ప్రొ బాస్ మోడళ్ల ధరలు మాత్రం స్టాండర్డ్ వెర్షన్ల లాగే పెరిగాయి.
బ్యాటరీ కెపాసిటీ,డ్రైవింగ్ రేంజ్
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రస్తుతం రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తోంది.
38kWh బ్యాటరీ ప్యాక్: ఇది సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 332 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుంది.
52.9kWh బ్యాటరీ ప్యాక్ : ఇది సింగిల్ ఛార్జ్‌పై 449 కిలోమీటర్ల సుదీర్ఘ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.