MG Windsor EV : నెక్సాన్, క్రెటాలకు చుక్కలు చూపించిన ఎంజీ ఎలక్ట్రిక్ కారు..2025లో తిరుగులేని రికార్డు

2025లో తిరుగులేని రికార్డు

Update: 2026-01-06 07:24 GMT

 MG Windsor EV :భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎంజీ విండ్‌సర్ ఒక ప్రభంజనం సృష్టించింది. 2025 క్యాలెండర్ ఏడాదిలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచి సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఈ కారు ధాటికి దిగ్గజ మోడల్స్ అయిన టాటా నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్ల అమ్మకాలు కూడా వెనకబడిపోయాయి. ఈ అద్భుతమైన విజయాన్ని గుర్గావ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.

ఎంజీ మోటార్ ఇండియా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2025 సంవత్సరంలో మొత్తం 46,735 యూనిట్ల విండ్‌సర్ కార్లు అమ్ముడయ్యాయి. అంటే సగటున నెలకు సుమారు 4,000 కార్లు అమ్ముడవుతూ స్థిరమైన డిమాండ్‌ను కొనసాగించాయి. భారతదేశంలో ఒకే ఒక్క ఎలక్ట్రిక్ మోడల్‌తో ఈ స్థాయి విక్రయాలను సాధించిన తొలి కంపెనీగా ఎంజీ రికార్డు సృష్టించింది. 2024తో పోలిస్తే 2025లో కంపెనీ ఈవీ అమ్మకాలు ఏకంగా 111 శాతం పెరగడం విశేషం. కేవలం మెట్రో నగరాలకే కాకుండా, ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా విండ్‌సర్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

విండ్‌సర్ సక్సెస్‌లో దాని వినూత్నమైన డిజైన్ కీలక పాత్ర పోషించింది. దీన్ని ఒక ఇంటెలిజెంట్ సియూవీగా కంపెనీ ప్రమోట్ చేస్తోంది. అంటే ఇందులో సెడాన్ కారు ఇచ్చే విలాసవంతమైన కంఫర్ట్, ఎస్‌యూవీ ఇచ్చే పర్ఫార్మెన్స్ రెండూ ఉంటాయి. దీని ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనివల్ల కారు ప్రారంభ ధర కేవలం రూ.9.99 లక్షలకే లభిస్తోంది. దీనికి అదనంగా కిలోమీటరుకు రూ.3.90 చొప్పున బ్యాటరీ అద్దె చెల్లిస్తే సరిపోతుంది. ఇది వినియోగదారులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించింది.

విండ్‌సర్ ఈవీ రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్లో అందుబాటులో ఉంది.

38 kWh బ్యాటరీ: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కి.మీ రేంజ్ ఇస్తుంది.

52.9 kWh బ్యాటరీ: ఇది ఏకంగా 449 కి.మీ రేంజ్ ఇస్తుంది. లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి ఇది సరైన ఎంపిక. JSW గ్రూప్, SAIC మోటార్ భాగస్వామ్యంలో నడుస్తున్న గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్ ఇప్పుడు ఏడాదికి లక్షకు పైగా వాహనాలను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వేగంతో వెళ్తే 2026లో కూడా ఎంజీ విండ్‌సర్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకునేలా కనిపిస్తోంది.

Tags:    

Similar News