Traffic Challan: వాహనదారులపై పేరుకుపోయిన పాత ఈ-చలాన్ల భారాన్ని తగ్గించుకునేందుకు గొప్ప అవకాశం లభించింది. సెప్టెంబర్ 12, 2026న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. భారీ డిస్కౌంట్లతో పాత ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకుని వాహన రికార్డులను శుభ్రం చేసుకునేందుకు ఇది సరైన సమయం.

భారీ ఊరటనిచ్చే జాతీయ లోక్ అదాలత్

నేటి రోజుల్లో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం కావడంతో తెలియక చేసే చిన్నచిన్న పొరపాట్లకు కూడా ఈ-చలాన్లు పడుతున్నాయి. కొన్నిసార్లు ఫైన్ల మొత్తం వేలల్లోకి చేరడంతో వాహనదారులు చెల్లించలేక వదిలేస్తుంటారు. ఇలాంటి పెండింగ్ చలాన్ల సమస్య నుంచి బయటపడటానికి జాతీయ లోక్ అదాలత్ ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తోంది. లోక్ అదాలత్‌లో నిర్దేశించిన రాయితీతో చాలా తక్కువ మొత్తానికే కేసులు పరిష్కారమవుతాయి. ఇక్కడ ఇచ్చే తీర్పు ఆఖరిది కావడంతో మళ్లీ ఏ కోర్టులోనూ అప్పీలు చేసుకునే అవకాశం ఉండదు. పైగా లీగల్ ఖర్చులు, సమయం ఆదా కావడం దీని ప్రత్యేకాంశం.

ఏ తరహా చలాన్లకు మినహాయింపు లభిస్తుంది?

లోక్ అదాలత్ ద్వారా కాంపౌండబుల్ నేరాల పరిధిలోకి వచ్చే చలాన్లను మాత్రమే పరిష్కరించుకోవచ్చు. ఓవర్ స్పీడింగ్, రాంగ్ పార్కింగ్, రెడ్ లైట్ జంప్ చేయడం వంటి పెనాల్టీలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. హెల్మెట్ లేకపోవడం, సీటు బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడటం, పీయుసీ లేదా ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల పడిన చలాన్లపై మంచి రాయితీ లభిస్తుంది. చాలా కాలంగా కోర్టులకు బదిలీ అయిన పాత కేసులను కూడా ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. మద్యం సేవించి వాహనం నడపడం వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన చలాన్లకు మాత్రం ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదు.

నమోదు ప్రక్రియ కోసం కావాల్సిన పత్రాలు

ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి వాహనదారులు తమ పరిధిలోని జిల్లా కోర్టు ప్రాంగణానికి నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉండే హెల్ప్ డెస్క్ వద్ద మీ వాహన సమాచారాన్ని సమర్పించాలి. అందుకోసం పెండింగ్ చలాన్ ప్రింటెడ్ కాపీ, వాహన ఆర్సీ, చెల్లుబాటులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాపీ, పీయుసీ సర్టిఫికేట్ దగ్గర ఉంచుకోవాలి. న్యాయమూర్తి సమక్షంలో ఇరుపక్షాల ఒప్పందంతో తుది మొత్తం ఖరారవుతుంది. ఆ మొత్తాన్ని అక్కడ చెల్లించగానే వెంటనే రసీదు అందిస్తారు. దీనివల్ల రవాణా శాఖ పోర్టల్‌లో మీ వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్ల రికార్డు తక్షణమే తొలిగిపోతుంది.

చలాన్లు చెల్లించకపోతే ఎదురయ్యే ముప్పు

చాలామంది చలాన్లను తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. పెండింగ్ చలాన్లు అలాగే ఉంటే భవిష్యత్తులో వాహన ఇన్సూరెన్స్ రెన్యూవల్ కాకపోవడం, ఎన్ఓసీ (NOC) పొందడంలో ఇబ్బందులు ఎదురుకావడం జరుగుతుంది. మరో వ్యక్తికి వాహనాన్ని విక్రయించినప్పుడు ఆర్సీ బదిలీ కాకుండా పోర్టల్ నిలిపివేస్తుంది. పదేపదే చలాన్లు బకాయి ఉంటే ట్రాఫిక్ పోలీసులు నేరుగా కోర్టు సమన్లు పంపే ప్రమాదం కూడా ఉంది. ఈ చిక్కులన్నీ దాటుకుని ప్రశాంతంగా ఉండటానికి సెప్టెంబర్ 12న జరిగే లోక్ అదాలత్‌ను వాడుకోవడం శ్రేయస్కరం.

Tags: