Audi Q3: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన పాపులర్ ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవీ Q3 థర్డ్ జనరేషన్ మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. మునుపటి కంటే పెద్దదిగా, మరింత పవర్‌ఫుల్ లుక్‌తో రూపుదిద్దుకున్న ఈ కారు పండగ సీజన్ నాటికి విడుదల కానుంది. రూ.60 లక్షల ప్రారంభ ధరతో బిఎమ్‌డబ్ల్యూ X1, మెర్సిడెస్-బెంజ్ GLAలకు గట్టి పోటీ నివ్వనుంది. మూడో తరం ఆడి Q3 డిజైన్ పరంగా భారీ మార్పులకు గురైంది. ఈ కొత్త ఎస్‌యూవీ పొడవు 4,531 మిమీ, వెడల్పు 1,859 మిమీ, ఎత్తు 1,623 మిమీ కొలతలతో పాత మోడల్ కంటే విస్తారమైన సైజులో కనిపిస్తుంది. ముందు భాగంలో విశాలమైన సింగిల్ ఫ్రేమ్ గ్రిల్, స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఈ కారుకు రోడ్డుపై మంచి ప్రెజెన్స్‌ను అందిస్తాయి. లైటింగ్ టెక్నాలజీలో ఆడి తన మార్కును మళ్లీ నిరూపించుకుంది. మైక్రో-ఎల్‌ఈడీ సాంకేతికతతో పనిచేసే డిజిటల్ మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లతో పాటు వెనుక వైపు డిజిటల్ ఓఎల్‌ఈడీ టెయిల్ లైట్లను అమర్చారు. వెనుక వైపు ఉన్న రెండు టెయిల్ ల్యాంప్‌లను కలుపుతూ ఎల్‌ఈడీ లైట్ బార్ లైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తొలిసారిగా వెనుక ఉండే ఆడి లోగో కూడా వెలిగేలా ప్రత్యేక ఫీచర్‌ను జోడించారు.

ప్రీమియం కేబిన్.. డిజిటల్ ఫీచర్ల మయం

వెలుపలి డిజైన్ మాత్రమే కాదు, లోపలి కేబిన్‌ను కూడా ఆడి పూర్తిగా కొత్తదనంతో తీర్చిదిద్దింది. డాష్ బోర్డుపై రెండు పెద్ద డిజిటల్ స్క్రీన్లు, కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కారుకు హైటెక్ లుక్‌ను తీసుకొచ్చాయి. సెంటర్ కన్సోల్, కంట్రోల్స్ స్వరూపాన్ని మార్చి మరింత సౌకర్యవంతంగా మార్చారు. బయటి శబ్దాలు కేబిన్‌లోకి రాకుండా ముందు విండోలకు అకౌస్టిక్ గ్లాస్ ఆప్షన్‌ను ఇస్తున్నారు. ప్రయాణికుల లగేజీ కోసం 488 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. వెనుక సీట్లను ముందుకు జరపడం, వెనక్కి వాల్చడం ద్వారా లేదా పూర్తిగా మడతపెట్టడం ద్వారా లగేజీ స్థలాన్ని 1,386 లీటర్ల వరకు పెంచుకోవచ్చు.

204 పిఎస్ పవర్‌ఫుల్ పెట్రోల్ ఇంజిన్

గ్లోబల్ మార్కెట్‌లో ఈ కారును పెట్రోల్, డీజిల్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్లలో విక్రయిస్తున్నప్పటికీ, భారత మార్కెట్లోకి మాత్రం 2.0-లీటర్ టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో తీసుకొస్తున్నారు. ఈ ఇంజిన్ 204 పిఎస్ పవర్, 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆడి ప్రసిద్ధ క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను జత చేశారు. భారత మార్కెట్లో డీజిల్ లేదా హైబ్రిడ్ వేరియంట్లు వచ్చే అవకాశం ప్రస్తుతానికి లేదు.

సురక్షిత ప్రయాణానికి హైటెక్ సెక్యూరిటీ

భద్రత విషయంలో కొత్త ఆడి Q3 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)తో వస్తోంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, ఫ్రంట్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, క్రాస్-ట్రాఫిక్ అసిస్ట్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డ్రైవర్ అలసటను లేదా దృష్టి మరలడాన్ని గుర్తించే డ్రైవర్ మానిటరింగ్ కెమెరాను కూడా పొందుపరిచారు. టాప్ వేరియంట్లలో రివర్స్ అసిస్ట్, ఆటోమేటెడ్ పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. ఆటోమేటెడ్ పార్కింగ్ సిస్టమ్ మునుపు చేసిన పార్కింగ్ మూవ్‌మెంట్లను గుర్తుంచుకుని స్వయంగా పార్క్ చేసుకోగలదు.

Tags: