Bajaj Pulsar: దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో భారత మార్కెట్లోకి అత్యంత ప్రజాదరణ పొందిన పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లలో కొత్త ఎడిషన్లను ప్రవేశపెట్టింది. సరికొత్త స్టైలింగ్, అత్యాధునిక డిజిటల్ ఫీచర్లతో ఇవి రూపుదిద్దుకున్నాయి. కొత్త పల్సర్ 125 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 92,990 కాగా, పల్సర్ 150 ప్రారంభ ధర రూ.1.15 లక్షలుగా నిర్ణయించారు. నూతన బజాజ్ పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లలో మునుపటి కంటే చాలా వెడల్పాటి ఫ్యూయల్ ట్యాంక్‌ను అమర్చారు. దీనివల్ల ఈ బైక్‌లకు మరింత మాస్క్యులర్, శక్తివంతమైన లుక్ వచ్చింది. 2001లో మొదటిసారి మార్కెట్‌లోకి అడుగుపెట్టిన పల్సర్ బ్రాండ్ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్లకు పైగా బైక్‌లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ కొత్త మోడళ్లను రూపొందించారు.

పల్సర్ 125లో కొత్తగా వచ్చిన మార్పులు

కొత్త పల్సర్ 125 మోడల్‌లో 124.38 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ DTS-i ఇంజన్ ఉపయోగించారు. ఇది 12.1 పీఎస్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్ (11.8 పీఎస్) తో పోలిస్తే ఇది మరింత శక్తివంతమైనది. ప్రయాణాన్ని సులభతరం చేయడానికి 5 ఇంచుల టిఎఫ్‌టి డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్, యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ అమర్చారు. నిలకడగా ప్రయాణించేందుకు క్రాల్ టెక్ టెక్నాలజీ జోడించారు. దీనివల్ల యాక్సిలరేటర్ ఇవ్వకుండానే బైక్ తక్కువ వేగంతో ట్రాఫిక్‌లో సులభంగా ముందుకు సాగుతుంది. ఈ బైక్ నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.

పల్సర్ 150 ఫీచర్లు.. అదనపు ప్రత్యేకతలు

పల్సర్ 150 బైక్‌లో 149.5 సీసీ ఆయిల్-కూల్డ్, ట్విన్-స్పార్క్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంది. ఇది 14 పీఎస్ పవర్‌ను అందిస్తుంది. ఇందులోనూ 5 ఇంచుల టిఎఫ్‌టి స్క్రీన్, గూగుల్ మ్యాప్స్, ఎల్‌ఈడీ లైటింగ్, టైప్-సి ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. ఈ స్క్రీన్‌పై బైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలను డిజిటల్‌గా సేవ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. లైవ్ కాల్స్, మెసేజ్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్స్, క్రాల్ టెక్నాలజీ, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్ వంటి ప్రత్యేకాంశాలు ఈ మోడల్‌ సొంతం. ఈ బైక్ మొత్తం ఐదు రంగుల ఎంపికల్లో లభిస్తుంది.

Tags: