New Bajaj Pulsar: దేశీయ మార్కెట్‌లో దశాబ్దాలుగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న బజాజ్ పల్సర్ సిరీస్ ఇప్పుడు సరికొత్త రూపంలోకి మారుతోంది. కంపెనీ నెక్స్ట్ జనరేషన్ పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లను ఆగస్టు 24, 2026న అధికారికంగా భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ బైక్‌లు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లకు చేరుకోవడం విశేషం. కేవలం బాహ్య రూపమే కాకుండా బైక్ యొక్క ప్లాట్‌ఫామ్, ఛాసిస్, ఇంజన్, టెక్నాలజీ విభాగాల్లో బజాజ్ సంస్థ ఊహించని మార్పులు చేసింది. పల్సర్ ఐకానిక్ లుక్‌ను దెబ్బతీయకుండానే మరింత షార్ప్, మోడరన్ డిజైన్‌తో దీనిని తీర్చిదిద్దారు.

కొత్త ప్లాట్‌ఫామ్ - మెరుగైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్

నెక్స్ట్ జనరేషన్ పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లను సరికొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేశారు. ఇందులో అందించిన కొత్త ఫ్రేమ్ బైక్ స్టెబిలిటీని, హ్యాండ్లింగ్‌ను గణనీయంగా పెంచుతుంది. బైక్ ముందు భాగంలో పెద్ద హెడ్‌లాంప్ కౌల్, చాలా మస్కులర్‌గా కనిపించే ఫ్యూయల్ ట్యాంక్, స్లిమ్‌గా మారిన టైల్ సెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రైడర్ల సౌకర్యార్థం సస్పెన్షన్ వ్యవస్థలో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ అందించనున్నారు. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్‌తో పాటు సింగిల్ ఛానల్ ఏబీఎస్ సేఫ్టీ సిస్టమ్ రానుంది.

పవర్ ఫుల్ ఇంజన్ - ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ

కొత్త మోడళ్లలో అత్యంత కీలకమైన మార్పు ఇంజన్ విభాగంలో చోటుచేసుకుంది. రెండు బైకుల్లోనూ మెరుగైన పవర్, టార్క్ అందించే నయా ఇంజన్లను బజాజ్ అమర్చింది. ముఖ్యంగా పల్సర్ 150 మోడల్‌లో ఆయిల్-కూలింగ్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురావడం విశేషం. దీనివల్ల ఎక్కువ దూరం వేగంగా ప్రయాణించినా ఇంజన్ వేడెక్కకుండా ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి పవర్ అవుట్‌పుట్, గేర్‌బాక్స్ వివరాలు లాంచ్ సమయంలో కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.

హైటెక్ ఫీచర్లతో కనెక్టివిటీ

కాలానికి అనుగుణంగా కొత్త పల్సర్ మోడళ్లలో సాంకేతికతకు బజాజ్ ప్రాధాన్యమిచ్చింది. టాప్ వేరియంట్లలో పూర్తి కలర్ టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ప్రవేశపెడుతున్నారు. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి స్మార్ట్ ఫీచర్లు ఈ కొత్త డిస్‌ప్లే ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ లేటెస్ట్ ఫీచర్లు యాడ్ అవ్వడం వల్ల పల్సర్ మునుపటి కంటే చాలా ప్రీమియమ్‌గా కనిపిస్తూ, కాంపిటీటర్లకు సవాలు విసరనుంది.

Tags: