Hyundai Verna : కొత్త డిజైన్, అదిరిపోయే ఫీచర్లు.. మార్కెట్లోకి హ్యుందాయ్ వెర్నా 2026 గ్రాండ్ ఎంట్రీ
మార్కెట్లోకి హ్యుందాయ్ వెర్నా 2026 గ్రాండ్ ఎంట్రీ
Hyundai Verna : భారతీయ సెడాన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హ్యుందాయ్ వెర్నా, ఇప్పుడు సరికొత్త 2026 మోడల్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ప్రస్తుత జనరేషన్ లాంచ్ అయిన తర్వాత జరిగిన మొట్టమొదటి భారీ అప్‌డేట్ ఇది. ఈసారి హ్యుందాయ్ కేవలం ఫీచర్లను మాత్రమే మార్చకుండా, వేరియంట్ల పేర్లను కూడా పూర్తిగా మార్చేసింది. పాత పేర్ల స్థానంలో ఇప్పుడు HX అనే కొత్త పేరును ప్రవేశపెట్టింది. స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, హోండా సిటీ వంటి గట్టి పోటీదారులను తట్టుకునేలా ఈ కారును తీర్చిదిద్దింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.10.98 లక్షల నుంచి రూ.18.25 లక్షల మధ్య ఉంది.
ఇంజన్, పర్ఫామెన్స్
కొత్త వెర్నాలో రెండు రకాల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ (115 hp పవర్), ఇది సిటీ డ్రైవింగ్‌కు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక వేగాన్ని ఇష్టపడే వారి కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (160 hp పవర్) ఉంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, ఆటోమేటిక్ ప్రియుల కోసం సివిటి (CVT), డిసిటి (DCT) ఆప్షన్లను కూడా కంపెనీ అందిస్తోంది.
వేరియంట్ల వారీగా ఫీచర్లు:
HX2 (బేస్): తక్కువ ధరలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (ABS), ఈఎస్‌సీ (ESC) వంటి కీలక భద్రతా ఫీచర్లతో వస్తుంది.
HX4: ఇందులో సన్‌రూఫ్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్, ఎల్‌ఈడీ డీఆర్ఎల్ (LED DRL) వంటి ఫ్యాన్సీ ఫీచర్లు యాడ్ అవుతాయి.
HX6: యాంబియంట్ లైటింగ్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు వైర్‌లెస్ ఛార్జర్‌తో కొంచెం ప్రీమియం లుక్ వస్తుంది.
HX6+: ఇది అసలైన వాల్యూ-ఫర్-మనీ మోడల్. ఇందులో బోస్ (Bose) సౌండ్ సిస్టమ్, వెంట్ లేటెడ్ సీట్లు ఉండటం విశేషం.
HX8: ఏడీఏఎస్ (ADAS) భద్రతా టెక్నాలజీ, 10.25-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఇందులో ఉంటాయి.
HX10 (టాప్): ఇది అత్యంత విలాసవంతమైన వేరియంట్. 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-వ్యూ మానిటర్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో సొంతం.
ఏది కొంటే బెటర్?
మీరు ఫీచర్లు, ధర మధ్య సరైన బ్యాలెన్స్ కావాలనుకుంటే HX6+ వేరియంట్ బెస్ట్ ఆప్షన్. ఇందులో లగ్జరీ కార్లలో ఉండే వెంట్ లేటెడ్ సీట్లు, ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్ వంటివి బడ్జెట్‌లోనే లభిస్తాయి. ఇక సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చి, అడ్వాన్సుడ్ టెక్నాలజీ కావాలనుకునే వారు HX8 లేదా HX10 వేరియంట్లను ఎంచుకోవచ్చు. మొత్తానికి కొత్త వెర్నా 2026 ఇప్పుడు మరింత శక్తివంతంగా, స్టైలిష్‌గా రోడ్లపైకి వచ్చేసింది.