New Maruti Brezza : మారుతి బ్రెజ్జా లవర్స్‌కు గుడ్ న్యూస్.. జూలై 23న మార్కెట్లోకి కొత్త ఎస్‌యూవీ

జూలై 23న మార్కెట్లోకి కొత్త ఎస్‌యూవీ

Update: 2026-06-30 13:19 GMT

New Maruti Brezza : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'బ్రెజ్జా'ను సరికొత్త అవతారంలో తీసుకొస్తోంది. న్యూ మారుతి బ్రెజ్జా 2026 మోడల్‌ను జూలై 23, 2026 న కంపెనీ అధికారికంగా మార్కెట్ ప్రపంచానికి పరిచయం చేయనుంది. తొలుత ఈ కారు లుక్‌ను రివీల్ చేసి, ఆ తర్వాత కొద్ది రోజులకే విక్రయాలను ప్రారంభించే అవకాశం ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త బ్రెజ్జాలో డిజైన్ పరంగా, ఇంటీరియర్ పరంగా చాలా మార్పులు చేశారు. గత కొన్ని నెలలుగా రోడ్లపై టెస్టింగ్ జరుగుతున్న సమయంలో లీకైన ఫోటోలు, వీడియోలను చూస్తే.. మారుతి ఈసారి ఈ ఎస్‌యూవీని మరింత అడ్వాన్స్‌డ్‌గా, ప్రీమియంగా తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది.

మొదటిసారిగా పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజన్

కొత్త బ్రెజ్జాలో రాబోతున్న అతిపెద్ద మార్పు దాని ఇంజనే అని చెప్పాలి. ఈ కార్‌లో మొదటిసారిగా 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందించబోతున్నారు, దీనిని ఇప్పటికే మారుతి ఫ్రాంక్స్ కారులో వాడుతున్నారు. ఈ ఇంజన్ సుమారు 100 bhp పవర్, 147 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి తోడు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండనుంది. ఇంజన్ కెపాసిటీ తక్కువగా ఉండటం వల్ల దీనిపై కేవలం 18 శాతం జీఎస్‌టీ మాత్రమే పడే అవకాశం ఉంది, దీనివల్ల కారు ధర సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే బేస్, మిడ్ వేరియంట్లలో మాత్రం పాత 1.5 లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అలాగే కొనసాగనుంది.

స్మార్ట్ సీఎన్‌జీ టెక్నాలజీ

మారుతి సుజుకి ఈ కొత్త బ్రెజ్జాలో కూడా సీఎన్‌జీ వేరియంట్‌ను కొనసాగిస్తోంది. కానీ ఈసారి కస్టమర్ల కోసం ఒక పెద్ద మార్పు చేసింది. సాధారణంగా సీఎన్‌జీ కార్లలో సిలిండర్ బ్యాక్‌సైడ్ డిక్కీలో ఉండటం వల్ల లగేజ్ పెట్టుకోవడానికి చోటు సరిపోదు. దీనిని అధిగమించడానికి మారుతి సంస్థ సీఎన్‌జీ సిలిండర్లను కారు కింద భాగంలో అమర్చబోతోంది. దీనివల్ల కారు వెనుక భాగంలో లగేజ్ పెట్టుకోవడానికి చాలా ఎక్కువ స్పేస్ లభిస్తుంది. ఇక కారు లోపల చూసుకుంటే 10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డిజైన్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు రాత్రి వేళల్లో లుక్ మార్చేసే అంబియంట్ లైటింగ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉండబోతున్నాయి.

లెవెల్-2 అడాస్ సేఫ్టీ, అదిరిపోయే లుక్

సేఫ్టీ విషయంలో మారుతి ఈసారి ఎక్కడా రాజీ పడలేదు. బ్రెజ్జా చరిత్రలోనే మొదటిసారిగా ఇందులో లెవెల్-2 అడాస్ టెక్నాలజీని జోడించనున్నారు. ఈ ఫీచర్ వల్ల కారు ఆటోమేటిక్‌గా బ్రేకులు వేయడం, లైన్ దాటకుండా హెచ్చరించడం, యాక్సిడెంట్లు కాకుండా డ్రైవర్‌ను అలర్ట్ చేయడం వంటి పనులు చేస్తుంది. డిజైన్ పరంగా చూస్తే కారు వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్లు, స్టైలిష్ 4-స్పోక్ అలాయ్ వీల్స్ రాబోతున్నాయి. కారు పాత బ్రెజ్జా బాక్సీ లుక్‌లోనే ఉన్నప్పటికీ, ఈ చిన్న చిన్న మార్పులు దీనికి మరింత కిల్లింగ్ లుక్‌ను ఇస్తున్నాయి.

ధర మరియు పోటీ ఎలా ఉండబోతోంది?

ఫీచర్లు భారీగా పెరుగుతుండటంతో కొత్త బ్రెజ్జా ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ.8.26 లక్షల నుంచి రూ.12.86 లక్షల మధ్య ఉంది. కొత్త మోడల్ లాంచ్ అయిన తర్వాత ఇది మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, స్కోడా కైలాక్ వంటి గట్టి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News