Toyota Fortuner : టయోటా ఫార్చ్యూనర్ కొత్త అవతారం.. టెస్టింగ్‌లో దొరికిపోయిన కిల్లర్ లుక్ ఎస్‌యూవీ
టెస్టింగ్‌లో దొరికిపోయిన కిల్లర్ లుక్ ఎస్‌యూవీ
Toyota Fortuner : భారతదేశంలో ఎస్‌యూవీలకి రారాజు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు టయోటా ఫార్చ్యూనర్. రోడ్డుపై ఈ కారు వెళ్తుంటే వచ్చే రాజసం, ఆ గంభీరం వేరు. ఇప్పుడు ఆ రాజసాన్ని మరింత పెంచేందుకు టయోటా సిద్ధమైంది. తాజాగా కొత్త ఫార్చ్యూనర్ మోడల్ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇది కంప్లీట్ కొత్త జనరేషన్ కాకపోయినప్పటికీ, ఇందులో చేసే మార్పులు మాత్రం కారుకు సరికొత్త రూపాన్ని ఇవ్వబోతున్నాయి. బాడీ షేప్ పాత మోడల్ లాగే ఉన్నా, విండో లైన్స్, డిజైన్‌లో చిన్న చిన్న మార్పులు చేస్తూ మోడ్రన్ లుక్‌ను తీసుకొస్తున్నారు.
ముఖ్యంగా కారు ముందు భాగం పూర్తిగా మారిపోనుంది. కొత్త బంపర్, సరికొత్త డిజైన్‌తో కూడిన గ్రిల్, స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్ ఈ కారుకు కొత్త అందాన్ని ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో వీల్ ఆర్చ్‌లు ఇప్పుడు హెక్సాగోనల్ ఆకారంలో ఉండి, మందపాటి నలుపు రంగు క్లాడింగ్‌తో కారుకు మరింత రఫ్ అండ్ టఫ్ లుక్‌ను ఇస్తాయి. అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా కొత్తగా ఉండబోతోంది. వెనుక వైపు చూస్తే, ఇప్పటి వరకు ఫార్చ్యూనర్‌లో లేని కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ సెటప్ వచ్చే అవకాశం ఉంది. ఇది కారు వెనుక భాగాన్ని మరింత ప్రీమియంగా మారుస్తుంది.
ఇక లోపలి విషయానికి వస్తే.. ఫార్చ్యూనర్‌లో ఫీచర్లు తక్కువగా ఉంటాయనే విమర్శలకు టయోటా ఈసారి చెక్ పెట్టబోతోంది. ఇందులో సరికొత్త పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండబోతోంది. దీనికి వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సదుపాయం ఉంటుంది. వీటితో పాటు మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, అదిరిపోయే సౌండ్ సిస్టమ్, కస్టమర్లు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. సేఫ్టీ కోసం మరిన్ని ఎయిర్‌బ్యాగ్‌లు, అడాస్ వంటి టెక్నాలజీని కూడా జోడించే అవకాశం ఉంది.
ఇంజిన్ పరంగా చూస్తే, టయోటా తన నమ్మకమైన 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌నే కొనసాగించనుంది. అయితే ఈసారి దానికి 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని జత చేయబోతున్నారు. దీనివల్ల కారు పర్ఫార్మెన్స్ పెరగడమే కాకుండా మైలేజీ కూడా కొంచెం మెరుగుపడుతుంది. విదేశాల్లో ఎలక్ట్రిక్ ఇంజిన్ ఆప్షన్ ఉన్నప్పటికీ, ఇండియాలో మాత్రం డీజిల్, పెట్రోల్ వెర్షన్లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ ఏడాది చివరలోగా ఈ సరికొత్త ఫార్చ్యూనర్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర కొంచెం పెరిగినప్పటికీ, ఇచ్చే ఫీచర్లు, లుక్ కోసం ఫార్చ్యూనర్ లవర్స్ ఎగబడటం ఖాయం.