Toyota Hilux : సింగిల్ ఛార్జ్‌తో 240 కి.మీ రేంజ్, డ్యూయల్ మోటార్ సెటప్‌తో టయోటా హైలెక్స్
డ్యూయల్ మోటార్ సెటప్‌తో టయోటా హైలెక్స్
Toyota Hilux : టయోటా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన తమ పికప్ ట్రక్ హైలక్స్ లో సరికొత్త ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈసారి హైలక్స్ పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ తో మార్కెట్లోకి వచ్చింది. కొత్త స్టైలింగ్, అప్డేటెడ్ ఇంటీరియర్, డ్యూయల్-మోటార్ సెటప్‌తో వచ్చిన ఈ ఆల్-ఎలక్ట్రిక్ పికప్ ట్రక్, ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో ఎంత దూరం ప్రయాణించగలదు? దీని పవర్, ఫీచర్లు, రేంజ్ వివరాలు తెలుసుకుందాం.
టయోటా కొత్త తరం హైలక్స్ పికప్ ట్రక్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది కంపెనీకి ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ కొత్త పికప్ ట్రక్ IMV బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంది. ఇది టయోటా తయారు చేసిన మొట్టమొదటి బాడీ-ఆన్-ఫ్రేమ్ ఎలక్ట్రిక్ వాహనం. హైలక్స్ ఈవీలో 59.2 kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ ప్యాక్ ముందు, వెనుక మోటార్లతో జత చేయబడింది.
ఈ పికప్ ట్రక్‌లో ఫుల్-టైమ్ AWD (ఆల్-వీల్ డ్రైవ్) సిస్టమ్ ఉంది. దీని వలన ఫ్రంట్ యాక్సిల్‌పై 205 Nm టార్క్, వెనుక యాక్సిల్‌పై 268.6 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఎలక్ట్రిక్ పికప్ ట్రక్‌ల కెపాసిటీ పై దృష్టి సారించిన టయోటా, ఈ కొత్త మోడల్‌ను ఆకర్షణీయమైన రేంజ్‌తో అందించింది. టయోటా హైలక్స్ ఈవీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. ఈ ట్రక్ పే-లోడ్ కెపాసిటీ 715 కిలోగ్రాములు, టోయింగ్ కెపాసిటీ 1,600 కిలోగ్రాములుగా ఉంది.
టయోటా హైలక్స్ ఆన్-రోడ్ ధర రూ. 33.22 లక్షల నుంచి ప్రారంభమై, టాప్-ఎండ్ మోడల్‌కు రూ. 41.90 లక్షల వరకు ఉంటుంది. ఈవీ వెర్షన్ కాకుండా, హైలక్స్ సాంప్రదాయ ఇంధన ఆప్షన్లతో పాటు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీలో కూడా లభిస్తుంది. హైలక్స్ 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో కూడా అందుబాటులో ఉంది. ఈ వాహనంలో ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ టెక్నాలజీతో కూడిన 48V మైల్డ్-హైబ్రిడ్ సెటప్ కూడా ఉంది. ఇది యాక్సిలరేషన్ సమయంలో ఇంజిన్‌కు సహాయం చేస్తుంది. తద్వారా ఫ్యూయెల్ కెపాసిటీ మెరుగుపడుతుంది. టయోటా భవిష్యత్తులో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే హైలక్స్ ఈవీని కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. దీనిని 2028లో విడుదల చేయనున్నారు.