Toyota Innova Crysta : భారత మార్కెట్లోకి కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా.. ల్యాండ్ క్రూజర్ రేంజ్ లుక్‌తో ఎంట్రీ

ల్యాండ్ క్రూజర్ రేంజ్ లుక్‌తో ఎంట్రీ

Update: 2026-06-05 08:25 GMT

Toyota Innova Crysta : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ ఎంపీవీ మోడల్ టయోటా ఇన్నోవా క్రిస్టా సరికొత్త అప్‌డేట్‌లతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. టయోటా కిర్లోస్కర్ మోటర్ సంస్థ ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.19.72 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ధర రూ.26.63 లక్షల వరకు ఉంటుంది. పాత మోడల్‌తో పోలిస్తే దీని బాహ్య డిజైన్, కేబిన్ వాతావరణం, ఫీచర్లలో కంపెనీ పలు కీలకమైన మార్పులు చేసింది. అయితే దీని ఇంజన్, మెకానికల్ సెటప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

ల్యాండ్ క్రూజర్ ప్రేరణతో సరికొత్త డిజైన్

కొత్త ఇన్నోవా క్రిస్టాలో అందరినీ ఆకట్టుకునే ప్రధాన మార్పు దాని ఫ్రంట్ డిజైన్. కారు ముందు భాగంలో సరికొత్త రేడియేటర్ గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్‌ను అమర్చారు. ఈ కొత్త లుక్ టయోటాకు చెందిన రూ.2.5 కోట్ల లగ్జరీ ఎస్‌యూవీ ల్యాండ్ క్రూజర్ LC300ని పోలి ఉంటుంది. దీనితో పాటు కారు వెనుక భాగంలో కొత్త బంపర్ గార్నిష్‌ను జత చేశారు. ఇది కారుకు మునుపటి కంటే మరింత ప్రీమియం, అట్రాక్టివ్ లుక్‌ను ఇస్తుంది. కారు సైజు, సిగ్నేచర్ షేప్‌ను మాత్రం అలాగే ఉంచడం వల్ల ఇన్నోవా క్రిస్టా పాత గుర్తింపు దెబ్బతినకుండా జాగ్రత్తపడ్డారు.

రాజసం ఉట్టిపడేలా లగ్జరీ ఇంటీరియర్

కారు లోపలి భాగాన్ని మరింత విలాసవంతంగా మార్చేందుకు టయోటా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందులో సరికొత్త డ్యూయల్-టోన్ లెదర్ సీట్ అప్హోల్‌స్టరీని అందించారు. డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్స్‌పై సరికొత్త ప్రీమియం ఫినిషింగ్‌ను ఉపయోగించారు. కేబిన్‌కు రిచ్ లుక్ ఇచ్చేందుకు గ్రేస్ కాపర్ యాక్సెంట్స్, వుడ్ ఫినిష్ ఇన్సర్ట్‌లను వాడారు. ఏసీ కంట్రోల్స్, స్విచ్‌లు, వెనుక సీట్ ప్రయాణికుల కోసం ఉండే బ్యాక్ టేబుల్ డిజైన్‌ను కూడా పూర్తిగా అప్‌డేట్ చేశారు. ఇది ప్రయాణికులకు ఒక విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది.

టెక్నాలజీ, మోడ్రన్ ఫీచర్ల ఎంట్రీ

ఆధునిక కాలానికి అనుగుణంగా కొత్త ఇన్నోవా క్రిస్టాలో ఎన్నో కొత్త ఫీచర్లను చేర్చారు. ముఖ్యంగా వైర్‌లెస్ మొబైల్ చార్జర్, టైర్లలో గాలి శాతాన్ని పర్యవేక్షించే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కారులో లగేజ్ పెట్టుకోవడానికి ప్రయాణికులకు వీలుగా కారు లోపల అనేక స్టోరేజ్ స్పేస్‌లను కేటాయించారు. వెనుక సీట్లలో ప్రయాణించే వారికి అత్యుత్తమ సౌకర్యాలను కల్పించారు.

పవర్‌ఫుల్ డీజిల్ ఇంజన్.. అద్భుతమైన మైలేజ్

ఇంజన్ విషయానికి వస్తే ఇన్నోవా క్రిస్టా తన పాత నమ్మకమైన పవర్‌నే నమ్ముకుంది. ఇందులో శక్తివంతమైన 2.4-లీటర్ డీజిల్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. టయోటా సంస్థ ప్రకారం.. ఈ భారీ ఎంపీవీ లీటరుకు సుమారు 15 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. మార్కెట్లో హైబ్రిడ్ ఆప్షన్ ఉన్న ఇన్నోవా హైక్రాస్ అమ్ముడవుతున్నప్పటికీ, ఈ ప్యూర్ డీజిల్ ఇంజనే క్రిస్టా మోడల్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. కమర్షియల్ ఆపరేటర్లు ఇప్పటికీ ఈ డీజిల్ ఇంజన్‌నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

సేఫ్టీకి పెద్దపీట.. 7 ఎయిర్‌బ్యాగ్‌లు

ప్రయాణికుల భద్రత విషయంలో టొయోటా ఎలాంటి రాజీ పడలేదు. కొత్త ఇన్నోవా క్రిస్టాలో టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఇచ్చారు. ఇందులో భాగంగా ఏకంగా 7 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ వంటి ఎన్నో అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇవి సుదీర్ఘ ప్రయాణాలలో కూడా ప్రయాణికులకు పూర్తి సురక్షితమైన అనుభవాన్ని అందిస్తాయి.

వారంటీ, అద్భుతమైన సర్వీస్ ఆఫర్లు

కస్టమర్ల నమ్మకాన్ని పెంచేందుకు టయోటా ఈ కారుపై 3 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీని అందిస్తోంది. కస్టమర్లు కావాలనుకుంటే ఈ వారంటీని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిలోమీటర్ల వరకు పొడిగించుకోవచ్చు. దీనితో పాటు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, తక్కువ సమయంలో సర్వీసింగ్ పూర్తి చేసే ఎక్స్‌ప్రెస్ మెయింటెనెన్స్ సర్వీస్, కారు కొనుగోలును సులభతరం చేయడానికి 7 సంవత్సరాల వరకు ఈఎంఐ సదుపాయాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది.

Tags:    

Similar News