NHAI : హైవేలపై ఇక ఏఐ నిఘా.. రోడ్డుపై చిన్న గుంత ఉన్నా ఇట్టే పట్టేస్తుంది

రోడ్డుపై చిన్న గుంత ఉన్నా ఇట్టే పట్టేస్తుంది

Update: 2026-03-24 09:27 GMT

NHAI : మన దేశంలోని జాతీయ రహదారుల రూపురేఖలను మార్చేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక భారీ టెక్నాలజీ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 40,000 కిలోమీటర్ల మేర హైవేలను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డ్యాష్‌క్యామ్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రవేశపెడుతోంది. మార్చి 2026లో ప్రారంభమైన ఈ వినూత్న వ్యవస్థ ద్వారా రోడ్ల నిర్వహణ మరింత స్మార్ట్‌గా, వేగంగా మారనుంది. దీనివల్ల ప్రయాణికులకు సురక్షితమైన, మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుంది.

డ్యాష్‌క్యామ్ అనలిటిక్స్ సర్వీస్ అంటే ఏమిటి?

ఈ కొత్త వ్యవస్థను డ్యాష్‌క్యామ్ అనలిటిక్స్ సర్వీస్ అని పిలుస్తారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైవేలపై నిరంతరం గస్తీ తిరిగే రూట్ పెట్రోలింగ్ వాహనాలకు హై-రిజల్యూషన్ స్మార్ట్ డ్యాష్‌క్యామ్‌లను అమర్చుతారు. ఈ వాహనాలు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు నిరంతరం వీడియోలు, ఫోటోలు తీస్తాయి. ఈ డేటాను ఏఐ సిస్టమ్ విశ్లేషించి, రోడ్డుపై ఉన్న సమస్యలను స్వయంగా గుర్తిస్తుంది. దీనివల్ల మనుషులు వెళ్లి నేరుగా తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండానే లోపాలను వేగంగా కనిపెట్టవచ్చు.

ఏయే సమస్యలను గుర్తిస్తుంది?

ఈ ఏఐ సిస్టమ్ దాదాపు 30 రకాలకు పైగా సమస్యలను ఇట్టే గుర్తించగలదు. రోడ్డుపై ఉన్న గుంతలు, బీటలు, అరిగిపోయిన తారు ఉపరితలం వంటి వాటిని ఇది సెకన్లలో పసిగడుతుంది. కేవలం రోడ్డు ఉపరితలం మాత్రమే కాకుండా.. లేన్ మార్కింగ్‌లు వెలిసిపోవడం, దెబ్బతిన్న క్రాష్ బారియర్లు, వెలగని స్ట్రీట్ లైట్లు, రోడ్డు సూచిక బోర్డుల పరిస్థితిని కూడా ఇది లెక్కిస్తుంది. దీనివల్ల హైవే నిర్వహణ పనులు చాలా పారదర్శకంగా మరియు వేగంగా జరుగుతాయి.

అక్రమ కట్టడాలు,సేఫ్టీ నిఘా

రోడ్డు భద్రత విషయంలో కూడా ఈ ఏఐ వ్యవస్థ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అనుమతి లేకుండా డివైడర్ల మధ్యలో చేసే అక్రమ కట్‌లు, అనధికారిక హోర్డింగ్‌లు, రోడ్డు పక్కన అడ్డంగా పెరిగిన చెట్లు, అక్రమ పార్కింగ్, బస్ స్టాప్‌ల స్థితిగతులను ఇది ట్రాక్ చేస్తుంది. వర్షం పడినప్పుడు నీరు నిలిచిపోయే ప్రాంతాలను, పూడికపోయిన డ్రైనేజీలను కూడా ఇది ఫోటోలతో సహా అధికారులకు నివేదిస్తుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట ముందే మరమ్మతులు చేపట్టవచ్చు.

నైట్ సర్వే, జోనల్ పర్యవేక్షణ

హైవేలపై రాత్రి ప్రయాణాలు మరింత సురక్షితంగా మార్చడానికి ఎన్‌హెచ్‌ఏఐ నెలకు కనీసం ఒకసారి నైట్ సర్వే కూడా నిర్వహిస్తుంది. రాత్రి పూట రోడ్డు మార్కింగ్‌లు, రిఫ్లెక్టర్లు, లైటింగ్ వ్యవస్థ ఎంతవరకు కనిపిస్తున్నాయి అనేది ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. మొత్తం నెట్‌వర్క్‌ను మెరుగ్గా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా హైవేలను 5 జోన్లుగా విభజించారు. ఈ డేటా అంతా ఒక సెంట్రల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్తుంది. అక్కడ అధికారులు రియల్ టైమ్‌లో రోడ్ల పరిస్థితిని చూస్తూ, మరమ్మతు పనులు ఎంతవరకు వచ్చాయో ట్రాక్ చేయవచ్చు.

Tags:    

Similar News