Ninja 650 vs Honda CBR 650R: రోడ్డుపై దూసుకెళ్లే స్పీడ్ కింగ్స్.. ఈ రెండింటిలో ఏది మీ క్రష్?
ఈ రెండింటిలో ఏది మీ క్రష్?
Ninja 650 vs Honda CBR 650R: భారతదేశంలో స్పోర్ట్స్ బైక్ పిచ్చి ఉన్న యువతకు మిడిల్‌వెయిట్ సెగ్మెంట్ అంటే చాలా ఇష్టం. మరీ హెవీగా కాకుండా, సిటీలోనూ అటు హైవే మీద కూడా దూసుకెళ్లే బైక్‌ల కోసం చాలా మంది చూస్తుంటారు. ఈ రేసులో ప్రస్తుతం 2026 కావాసాకి నింజా 650,హోండా CBR 650R మధ్య గట్టి పోటీ నడుస్తోంది. రెండు బైక్‌లు 650 సీసీ రేంజ్‌లోనే ఉన్నప్పటికీ, వీటి పనితీరు, ధరల్లో భారీ తేడాలు ఉన్నాయి. మరి స్పీడ్, పవర్, కంఫర్ట్ విషయంలో ఏ బైక్ బెస్టో ఈ రిపోర్ట్‌లో తెలుసుకుందాం.
ఈ రెండు బైక్‌ల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం ధర. కవాసాకి నింజా 650 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.7.91 లక్షలు. అదే హోండా CBR 650R విషయానికి వస్తే, దీని ధర అక్షరాలా రూ.11.16 లక్షలు. అంటే హోండా బైక్ నింజా కంటే దాదాపు 3 లక్షల రూపాయలు ఎక్కువ. బడ్జెట్ చూసుకునే వారికి నింజా బెస్ట్ ఆప్షన్. అయితే, హోండా బైక్ చూడటానికి అచ్చం ఒక సూపర్ బైక్ లాగా భారీగా, వెడల్పుగా ఉండి ప్రీమియం లుక్ ఇస్తుంది. ట్రాక్ మీద రైడింగ్ చేయాలనుకునే వారికి హోండా డిజైన్ బాగా నచ్చుతుంది.
ఇంజిన్ పవర్: ఏది ఎక్కువ సౌండ్ చేస్తుంది?
నింజా 650లో 649 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ఉంది. ఇది 67 bhp పవర్, 64 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇది సిటీ రోడ్లపై నడపడానికి చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక హోండా CBR 650R విషయానికొస్తే.. ఇందులో 649 సీసీ ఇన్లైన్-4 ఇంజిన్ ఉంటుంది. ఇది ఏకంగా 94-95 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్లైన్-4 ఇంజిన్ వల్ల హోండా బైక్ ఇచ్చే సౌండ్ అదిరిపోతుంది. రేసింగ్ బైక్ ఫీల్ కావాలనుకునే వారికి హోండా సెకన్ల వ్యవధిలో మెరుపు వేగంతో దూసుకెళ్లే అనుభూతిని ఇస్తుంది.
ఫీచర్లు, కంఫర్ట్
2026 నింజా 650లో 4.3 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రెండు మోడ్ల ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. దీని సీటు ఎత్తు (790 మిమీ) తక్కువగా ఉండటం వల్ల తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు కూడా సులభంగా నడపవచ్చు. మరోవైపు హోండా బైక్‌లో ఈ-క్లచ్ అనే సరికొత్త టెక్నాలజీ ఉంది. ఇది ట్రాఫిక్‌లో క్లచ్ వాడకాన్ని తగ్గిస్తుంది. అయితే దీని బరువు 211 కిలోలు, సీటు ఎత్తు 810 మిమీ ఉండటం వల్ల ఇది కొంచెం భారీగా అనిపిస్తుంది. సరసమైన ధరలో మంచి స్పోర్ట్స్ బైక్ కావాలంటే నింజా, లేదు బడ్జెట్ ఎక్కువైనా సరే పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, సూపర్ బైక్ సౌండ్ కావాలంటే హోండా CBR 650R బెస్ట్.